Maharashtra: ఆసుపత్రిలో కన్నీళ్లు పెట్టుకున్న నవనీత్, ఓదార్చిన భర్త రవి రాణా.. వైరల్‌గా మారిన ఫొటోలు
- హనుమాన్ ఛాలీసా వివాదంలో అరెస్టయిన నవనీత్ దంపతులు
- 10 రోజుల పాటు వేర్వేరు జైళ్లలో గడిపిన వైనం
- జైలు నుంచి నేరుగా లీలావతి ఆసుపత్రికి నవనీత్
- భర్తను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మహిళా ఎంపీ
- భార్య కన్నీటిని తుడిచి ఓదార్చిన ఎమ్మెల్యే రవి రాణా
హనుమాన్ ఛాలీసా వివాదంలో అరెస్టయిన ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాలు గురువారం విడుదలయ్యారు. ముంబై సెషన్స్ కోర్టు వీరిద్దరికీ బుధవారమే బెయిల్ మంజూరు చేయగా... 10 రోజుల పాటు వేర్వేరు జైళ్లలో గడిపిన వీరు గురువారం జైలు నుంచి విడుదలయ్యారు.
భర్త కంటే కాస్తంత ముందుగా విడుదలైన నవనీత్ కౌర్ నేరుగా లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. 10 రోజుల పాటు జైల్లో ఉన్న కారణంగా అనారోగ్యంతో ఆమె ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. నవనీత్ కౌర్ ఆసుపత్రికి వెళ్లిన చాలా సేపటికి జైలు నుంచి విడుదలైన రవిరాణా.. తన భార్య ఆసుపత్రిలో చేరిందన్న సమాచారంతో నేరుగా లీలావతి ఆసుపత్రికి వెళ్లారు.
ఈ క్రమంలో ఆసుపత్రిలో బెడ్‌పై చికిత్స తీసుకుంటున్న నవనీత్ కౌర్ భర్తను చూడగానే ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. భార్య కన్నీటిని చూసిన రవి రాణా ఆమె కన్నీళ్లను తుడిచి ఓదార్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.
హనుమాన్ ఛాలీసా వివాదంలో ఎంపీ, ఎమ్మెల్యే దంపతులు ఒంటరయ్యారని, వారికి మద్దతు ప్రకటిస్తూ పలువురు కామెంట్ చేశారు. అదే సమయంలో ఈ ఫొటోలపై ట్రోలింగ్ చేస్తూ కూడా పెద్ద సంఖ్యలో కామెంట్లు పోస్ట్ అవుతున్నాయి.