Helicopter Ride: హెలికాప్టర్ ఎక్కిస్తా... విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన చత్తీస్ గఢ్ సీఎం
- 10, 12వ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహకం
- 10 మంది టాపర్లకు హెలికాప్టర్ ప్రయాణం చాన్స్
- వారిని రాయ్ పూర్ ఆహ్వానిస్తానన్న బఘేల్
ఎక్కడైనా విద్యార్థులు ర్యాంకులు సాధిస్తే వారికి నగదు నజరానా, ల్యాప్ టాప్, ట్యాబ్ వంటి బహుమతులు ఇవ్వడం సాధారణ విషయం. కానీ చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ మాత్రం ఓ అడుగు ముందుకేసి విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. 10, 12వ తరగతుల పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించే 10 మంది విద్యార్థులను హెలికాప్టర్ ఎక్కిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ టాపర్లకు హెలికాప్టర్ లో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని చెప్పారు.
పిల్లలకు ఈ హెలికాప్టర్ ప్రయాణం ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని, జీవితంలోనూ ఉన్నతమైన ఎత్తులకు ఎదగాలన్న వారి ఆశయానికి ప్రేరణ కలిగిస్తుందని సీఎం భూపేశ్ అభిప్రాయపడ్డారు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత టాప్-10 విద్యార్థులను హెలికాప్టర్ ప్రయాణం కోసం రాయ్ పూర్ ఆహ్వానిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పర్యటనలు సాగిస్తున్న సీఎం బఘేల్ బలరాంపూర్ జిల్లా రాజ్ పూర్ లో ఈ మేరకు మీడియా సాక్షిగా ప్రకటన చేశారు.