Pope Francis: ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రకు ఇదే కారణం కావచ్చు: పోప్ ఫ్రాన్సిస్

Reason for Russia war on Ukraine may be NATO says Pope Francis

  • రష్యా గుమ్మం ముందు నాటో మొరగడమే యుద్ధానికి కారణం కావచ్చన్న పోప్ 
  • పొరుగు దేశాల్లో నాటో ఉనికి పుతిన్ ను రెచ్చగొట్టి ఉండొచ్చని వ్యాఖ్య 
  • నాతో భేటీ అయ్యే ఉద్దేశం పుతిన్ కు లేనట్టుందన్న పోప్ 

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులు తీవ్ర స్థాయికి చేరాయి. రష్యా దాడులతో ఉక్రెయిన్ నగరాలు ధ్వంసమవుతున్నాయి. ప్రతి నగరం కూడా గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధానికి సంబంధించి పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా గుమ్మం ముందు నిలబడి నాటో మొరగడమే యుద్ధానికి కారణమై ఉండొచ్చని అన్నారు. రష్యా సమీప దేశాల్లోకి నాటో వెళ్లడం పుతిన్ ను రెచ్చగొట్టేలా చేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. తమ పొరుగుదేశాల్లో నాటో ఉనికి ఫలితమే ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రకు కారణమని అనుకుంటున్నానని చెప్పారు. ఇటలీకి చెందిన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపే విషయమై పుతిన్ తో తాను మాట్లాడాలనుకుంటున్నానని... దీనికి సంబంధించి ఇప్పటికే సమయాన్ని కోరానని... కానీ, ఇంత వరకు కు క్రెమ్లిన్ నుంచి సమాధానం రాలేదని పోప్ చెప్పారు. తనతో భేటీ అయ్యే ఉద్దేశం పుతిన్ కు లేనట్టుందని వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని ఆపేందుకు తాను తప్పకుండా ప్రయత్నిస్తానని చెప్పారు. ఇప్పుడు తాను ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు వెళ్లబోనని... తొలుత రష్యా రాజధాని మాస్కోకు వెళ్తానని తెలిపారు. పుతిన్ ను కలిసి యుద్ధాన్ని ఆపమని సూచిస్తానని చెప్పారు. 

ఉక్రెయిన్ పై ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం... 1990ల్లో రువాండాలో చోటు చేసుకున్న నరమేధం వంటిదేనని పోప్ అన్నారు. టుట్సీ మైనార్టీలను తుడిచి పెట్టేందుకు అతివాద హుతూ పాలకులు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని చెప్పారు. అప్పుడు జరిగిన నరమేధంలో దాదాపు 8 లక్షల మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News