Devineni Uma: పోలవరం వెళ్లిన మంత్రి అంబటికి ఇప్పుడే నిజాలు తెలిశాయా?: దేవినేని ఉమ వ్యంగ్యం
- నిన్న పోలవరం వెళ్లిన అంబటి
- నీటి పారుదల శాఖ మంత్రి హోదాలో తొలిసారి వెళ్లిన వైనం
- డయాఫ్రం వాల్ గత ప్రభుత్వాల వల్లే దెబ్బతిన్నదని వెల్లడి
- బదులిచ్చిన దేవినేని ఉమ
ఇటీవలే ఏపీ నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబుపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ధ్వజమెత్తారు. పోలవరం వెళ్లిన మంత్రి అంబటికి ఇప్పుడే నిజాలు తెలిశాయా? అంటూ ఎద్దేవా చేశారు. జగన్ అవినీతిలో పోలవరం నిర్మాణమే ప్రశ్నార్థకమైందని అన్నారు. మూడేళ్లుగా ప్రాజెక్టు రివ్యూ, పనుల వివరాలు ఎందుకు చెప్పలేదని ఉమ నిలదీశారు. పోలవరం నిర్వాసితుల నిధులను వైసీపీ నేతలే స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. జగన్ అహంకార పూరిత నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని విమర్శించారు.
ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు నిన్న పోలవరంలో తొలిసారి పర్యటించిన సంగతి తెలిసిందే. స్పిల్ వే చానల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ, ప్రాజెక్ట్ పై అవగాహన పెంచుకోవడం కోసమే క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని తెలిపారు.
అయితే, గత ప్రభుత్వాల కారణంగానే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా ఇలా డయాఫ్రం వాల్ దెబ్బతినలేదని, పోలవరంలో మాత్రమే ఇలా జరిగిందని అన్నారు. ఏదో చేయాలన్న ఆరాటంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు నష్టం కలిగించారని అంబటి విమర్శించారు. అంబటి వ్యాఖ్యలపైనే దేవినేని ఉమ పైవిధంగా స్పందించారు.