Bojjala Gopala Krishna Reddy: చిత్తూరు జిల్లాలో తిరుగులేని నేత.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు... బొజ్జలపై కథనం!

Bojjala Gopala Krishna Reddy is very close aid to Chandrababu

  • రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన బొజ్జల
  • న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేందుకు హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన బొజ్జల
  • ఆ తర్వాత టీడీపీలో చేరిన వైనం
  • తొలి ఎన్నికలోనే భారీ మెజార్టీతో ఘన విజయం
  • చంద్రబాబు కేబినెట్లో పలు శాఖలకు మంత్రిగా పని చేసిన బొజ్జల
  • అలిపిరి బాంబ్ బ్లాస్ట్ సమయంలో కూడా చంద్రబాబు పక్కనే ఉన్న బొజ్జల

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి అందరినీ షాక్ కు గురి చేస్తోంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన... కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. 

బొజ్జల కుటుంబానికి ఎప్పటి నుంచో రాజకీయ నేపథ్యం ఉంది. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆయన తిరుగులేని ఆధిపత్యాన్ని ఎన్నో ఏళ్ల పాటు కొనసాగించారు. 1949 ఏప్రిల్ 15న చిత్తూరు జిల్లా (అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ)లోని ఉరందూరులో బొజ్జల జన్మించారు. ఆయన తండ్రి సుబ్బరామిరెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా చేశారు. 

1968లో సైన్స్ లో డిగ్రీ చేసిన బొజ్జల... ఆ తర్వాత శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ నుంచి 1972లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. మాజీ మంత్రి, దివంగత పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి కుమార్తె బృందను ఆయన పెళ్లాడారు. పెళ్లి చేసుకున్న తర్వాత న్యాయవాదిగా వృత్తిని కొనసాగించేందుకు బొజ్జల హైదరాబాదుకు షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న ఆయన... టీడీపీలో చేరారు. 1989 ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో బలమైన నేతగా ఎదిగారు. చంద్రబాబు కేబినెట్లో పలు శాఖలకు మంత్రిగా పని చేశారు. 

టీడీపీ అధినేత చంద్రబాబుకు అంత్యంత సన్నిహితుడిగా బొజ్జలకు పేరుంది. 2003 అక్టోబర్ 1న అలిపిరి బాంబ్ బ్లాస్ట్ ఘటన జరిగినప్పుడు కూడా చంద్రబాబుతో పాటు బొజ్జల ఉన్నారు. ఈ పేలుడులో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డారు. బొజ్జలకు ఛాతి, భుజానికి గాయాలయ్యాయి. చంద్రబాబుకు ఛాతి, ఎడమ చేయి, ముక్కుకు గాయాలయ్యాయి. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బొజ్జల మరణం పట్ల పార్టీలకు అతీతంగా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

  • Loading...

More Telugu News