Sandy Island: పసిఫిక్ మహాసముద్రంలో మిస్టరీ దీవి!
- ఆస్ట్రేలియా, న్యూ కలెడోనియా మధ్యన శాండీ ఐలాండ్
- 1776లో గుర్తించిన కెప్టెన్ కుక్
- 1876లోనూ కనిపించిన వైనం
- 2012లో పరిశోధనకు వెళ్లిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు
- నీరు తప్ప ఏమీ కనిపించని వైనం
శాండీ ఐలాండ్... ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు, న్యూ కలెడోనియా దీవికి మధ్యలో ఉంటుంది. అయితే, ఈ శాండీ ఐలాండ్ పరిశోధకులకు అంతుచిక్కని దీవిలా తయారైంది. ఇది గూగుల్ మ్యాప్స్ లో ఒక్కోసారి కనిపిస్తుంది, మళ్లీ మాయమవుతుంది. ప్రఖ్యాత బ్రిటన్ నావికుడు కెప్టెన్ జేమ్స్ కుక్ దీన్ని తొలిసారిగా 1776లో గుర్తించాడు. ఆ తర్వాత వందేళ్లకు 1876లో వెలాసిటీ అనే నౌక తిమింగలాలను వేటాడుతూ ఈ దీవికి సమీపానికి వెళ్లింది.
19వ శతాబ్దంలో ఇంగ్లండ్, జర్మనీ దేశాల్లో ప్రచురించిన మ్యాప్ ల్లో కూడా ఈ దీవిని పొందుపరిచారు. 1895లో దీన్ని కాస్తంత స్పష్టంగా గుర్తించగా, ఇది 24 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందని అంచనాకు వచ్చారు. అయితే, 1979లో ఫ్రెంచ్ హైడ్రోగ్రాఫిక్ సర్వీస్ కంపెనీ రూపొందించిన సముద్ర ప్రయాణ చార్టుల్లో ఈ దీవి ఉనికే లేకుండా పోయింది.
ఈ మిస్టరీ ఏంటో తేలుద్దామని 2012లో అనేకమంది ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఆ దీవి ఉండొచ్చని భావించిన ప్రాంతానికి వెళ్లారు. కానీ వారికి ఎటు చూసినా సముద్రమే తప్ప ఆ దీవి మాత్రం కనిపించలేదు. ఒకవేళ సముద్రపు ఆటుపోట్లకు భూమి మునగడం, తేలడం సహజం కాబట్టి... ఆ విధంగా జరిగి ఉంటుందేమోనని అక్కడి లోతు కొలిచారు.
ఆస్ట్రేలియా పరిశోధకులను దిగ్భ్రాంతికి గురిచేస్తూ 4,300 అడుగుల లోతున తప్ప పైభాగంలో ఎక్కడా భూమి తగల్లేదు. దాంతో, ఆ దీవి సముద్రంలో మునిగిపోయి ఉంటుదేమో అన్న వాదనలు కూడా వీగిపోయాయి. ఈ సర్వే జరిగిన నాలుగు రోజుల తర్వాత గూగుల్ తన మ్యాప్స్ నుంచి ఈ దీవిని తొలగించింది. గూగుల్ పేర్కొన్న రేఖాంశం, అక్షాంశాల ఆధారంగా మ్యాప్స్ లో ఆ దీవి ఉన్న ప్రాంతంలో ఓ చిన్న ముద్దలాంటి ఆకారం మాత్రం దర్శనమిస్తుంది. కానీ, ఇప్పటితరంలో ఆ దీవిని నిజంగా చూసినవాళ్లే లేరు.