Rahul Gandhi: తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న దొంగ ఎవరు?... వాళ్లతో మాకు పొత్తా?: రాహుల్ గాంధీ
- పొత్తుపై క్లారిటీ ఇచ్చిన రాహుల్
- టీఆర్ఎస్ తో పొత్తుపై ఎవరూ మాట్లాడొద్దని స్పష్టీకరణ
- అలాంటి నేతలు తమకు అక్కర్లేదని వెల్లడి
- ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి తీరుతామని ధీమా
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ రైతు సంఘర్షణ సభలో తెలంగాణ అధికార పక్ష నేతలపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న దొంగ ఎవరు? అంటూ ప్రశ్నించారు. తెలంగాణను దోచుకున్న వ్యక్తులతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని ఎలా అనుకున్నారు? ఈ పొత్తుపై కాంగ్రెస్ నేతలు ఎవరు మాట్లాడినా వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తాం అని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఎంత పెద్దవారైనా ఈ విషయంలో ఉపేక్షించేది లేదని తెలిపారు.
ఒకవేళ ఎవరైనా కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తో పొత్తుకు ఇష్టపడితే వారు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోవచ్చని సూచించారు. అటువంటి నేతలు తమకు అవసరంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఓడించడం ఖాయమని, హస్తం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని అన్నారు. ప్రజల కోసం, రైతుల కోసం పోరాడని నేతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇచ్చేది లేదని రాహుల్ తేల్చిచెప్పారు. ప్రజల్లో ఉండి సేవ చేసే వ్యక్తికే టికెట్ ఇస్తామని అన్నారు.