NFHS: దేశంలో తగ్గిన సంతాన సాఫల్యత.. పెరిగిన ఊబకాయం: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే

Fertility falls obesity goes up in India says National Family Health Survey

  • గత సర్వేతో పోలిస్తే 2కు పడిపోయిన ఫెర్టిలిటీ రేటు
  • ‘రీప్లేస్‌మెంట్ లెవల్ ఆఫ్ ఫెర్టిలిటీ’కి పైన ఐదు రాష్ట్రాలు మాత్రమే
  • గ్రామాల్లో 87 శాతం జననాలు ఆసుపత్రుల్లోనే
  • స్త్రీపురుషుల్లో పెరిగిపోతున్న ఊబకాయం
  • వివాహ వయసు రాకుండానే పెళ్లిళ్లు చేసుకుంటున్న బెంగాల్ మహిళలు

దేశంలో సంతాన సాఫల్యత రేటు తగ్గి ఊబకాయం పెరిగినట్టు ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్) వెల్లడించింది. 2015-16లో నిర్వహించిన నాలుగో సర్వేతో పోలిస్తే తాజా 2019-21 సర్వేలో సంపూర్ణ సంతాన సాఫల్య రేటు (టీఎఫ్ఆర్) 2.2 నుంచి 2కు పడిపోయింది. 

దేశంలో ఐదు రాష్ట్రాలు మాత్రమే ‘రీప్లేస్‌మెంట్ లెవల్ ఆఫ్ ఫెర్టిలిటీ’ 2.1కి ఎగువన ఉన్నాయి. తరాలు మారుతున్నప్పటికీ జన సంఖ్యలో తేడా లేకుండా ఉండాలంటే ఇది ఎంతో కీలకం. ఇక, పైన చెప్పుకున్న ఐదు రాష్ట్రాల్లో బీహార్‌ (2.98), మేఘాలయ (2.91), ఉత్తరప్రదేశ్ (2.35), ఝార్ఖండ్ (2.26), మణిపూర్ (2.17) మాత్రమే రీప్లేస్‌మెంట్ లెవల్ ఆఫ్ ఫెర్టిలిటీకి పైన ఉన్నాయి. 

సర్వేలో వెల్లడైన మరో ముఖ్యమైన విషయం సంస్థాగత జననాలు. దేశంలో ఇవి 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో 87 శాతం జననాలు ఆసుపత్రుల్లో జరుగుతుండగా, పట్టణ ప్రాంతాల్లో 94 శాతం జననాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. 

ఇక దేశంలోని స్త్రీపురుషుల్లో ఊబకాయం విపరీతంగా పెరిగినట్టు సర్వేలో వెల్లడైంది. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్-4తో పోలిస్తే ఈ సర్వేలో మహిళల్లో ఊబకాయం మూడుశాతం పెరిగింది. గత సర్వేలో ఇది 21 శాతం ఉండగా, ఇప్పుడు 24 శాతానికి చేరుకుంది. పురుషుల్లో ఇది 19 శాతం నుంచి 23 శాతానికి పెరిగింది. 

వివాహ వయసు రాకుండానే పెళ్లి చేసుకుంటున్న మహిళల సంఖ్య పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 42 శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 33 శాతం మంది వివాహ వయసుకు ముందే పెళ్లి చేసుకుంటున్నారు. దేశంలో మద్యం తాగే అలవాటు స్త్రీలలో ఒకశాతం ఉండగా, 22 శాతం మంది పురుషులకు ఆ అలవాటు ఉంది. మద్యం తీసుకునే మహిళల్లో 17 శాతం మంది ప్రతి రోజూ తాగుతుండగా, 37 శాతం మంది వారానికి ఒకసారి మద్యం తీసుకుంటున్నారు. పురుషుల్లో 15 శాతం మంది ప్రతిరోజూ, 43 శాతం మంది వారానికోసారి తాగుతున్నారు.

మద్యం తాగే మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ (18) అగ్రస్థానంలో ఉంది. ఇక, 15-19 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన వారిలో 8 శాతంతో ముస్లిం మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ సర్వే కోసం దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో 6.37 లక్షల కుటుంబాలను ప్రశ్నించారు. మొత్తంగా 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషులను ప్రశ్నించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు.

  • Loading...

More Telugu News