Rahul Gandhi: చంచల్ గూడ జైల్లో ములాఖత్ కు రాహుల్ కు అనుమతి
- జైల్లో ఉన్న 18 మంది ఎన్ఎస్యూఐ నేతలు
- ఈ మధ్యాహ్నం వారిని కలవనున్న రాహుల్
- రాహుల్ తో పాటు వెళ్లనున్న రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించేందుకు ఆయనకు అనుమతి లభించింది. తొలుత ఆయనకు అనుమతిని ఇవ్వని సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ నేతలు మరోసారి విన్నవించడంతో అధికారులు అంగీకరించారు.
ములాఖత్ కు అనుమతిని ఇచ్చినట్టు జైళ్ల శాఖ డీజీ జితేందర్ తెలిపారు. అయితే రాహుల్ తో పాటు జైలు లోపలకు వెళ్లడానికి కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతిని ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ తో పాటు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క జైలుకు వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం వీరు ముగ్గురూ జైల్లో ఉన్న 18 మంది ఎన్ఎస్యూఐ నేతలను కలవనున్నారు. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీ పర్యటనకు అనుమతిని నిరాకరించడంతో ఎన్ఎస్యూఐ నిరసన చేపట్టింది. దీంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.