Stalin: ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం స్టాలిన్.. ఐదు ప్రకటనలు
- విద్యార్థులకు పాఠశాలల వద్దే అల్పాహారం
- వైద్య పరీక్షలకు ఒక పథకం
- శాసనసనభలో స్టాలిన్ ప్రకటన
- చెన్నై నగరంలో బస్సులో ప్రయాణం
- తన పాలనపై ప్రయాణికుల నుంచి ఆరా
తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర శాసనసభలో ఐదు కీలక ప్రకటనలు చేశారు.
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రకటించారు. దీని కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉదయం టిఫిన్ కూడా పెడుతుంది. అలాగే, స్కూల్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్, పాఠశాల విద్యార్థులకు మెడికల్ చెకప్, పట్టణాల్లో మాదిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి, 'మీ నియోజకవర్గంలో సీఎం' అనే పథకాలను ప్రారంభిస్తున్నట్టు స్టాలిన్ తెలిపారు.
ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఎంకే స్టాలిన్ (69) శనివారం ఉదయం చెన్నై నగరంలో బస్ లో అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడారు. తన ప్రభుత్వం ఏడాది పాలన గురించి ఏమనుకుంటున్నారు? అంటూ బస్సు కండక్టర్, ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. మెరీనాబీచ్ సమీపంలోని తన తండ్రి డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి సమాధి వద్ద నివాళులు అర్పించారు.