Hemanth Soren: మైనింగ్ స్కామ్ లో ఝార్ఖండ్ సీఎంకు బిగుస్తున్న ఉచ్చు.. ఐఏఎస్ అధికారిణి సన్నిహితుల నుంచి కట్టలకు కట్టలు డబ్బు స్వాధీనం!

ED Shocks Jharkhand CM Hemant Soren

  • ఇప్పటికే ఎన్నికల సంఘం నోటీసులు
  • నిన్న ఝార్ఖండ్, బెంగాల్, బీహార్ లో ఈడీ దాడులు
  • ఝార్ఖండ్ మైనింగ్ సెక్రటరీ ఇల్లు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు
  • రూ.19.31 కోట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు

మైనింగ్ స్కామ్ లో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మరిన్ని చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆయన చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఓ మైన్ ను తన సొంతానికి కేటాయించుకున్నందుకు సీఎంగా ఎందుకు అనర్హత వేటు వేయొద్దో చెప్పాలంటూ ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులిచ్చిన కొన్ని రోజులకే ఈడీ కూడా షాకిచ్చింది. 

మైనింగ్ స్కామ్, ఉపాధి నిధుల దారి మళ్లింపునకు సంబంధించి నిన్న ఆ రాష్ట్రంలోని 12 ప్రదేశాలతో పాటు బెంగాల్, బీహార్ లో దాడులు చేసింది. ఝార్ఖండ్ ఐఏఎస్ అధికారిణి, ఆ రాష్ట్ర గనులు, భౌగోళికశాఖ కార్యదర్శి పూజా సింఘాల్ అత్యంత సన్నిహితుల నుంచి రూ.19.31 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో పూజా సింగాల్ చార్టర్డ్ అకౌంటెంట్ అయిన సుమన్ కుమార్ దగ్గర్నుంచే రూ.17 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 

అలాగే మరో ప్రాంతం నుంచి రూ.1.8 కోట్లు సీజ్ చేశారు. లెక్కల్లోలేని డబ్బుతో పాటు పలు డాక్యుమెంట్లనూ ఐఏఎస్ అధికారి ఇంటి నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉపాధి నిధుల్లో రూ.18 కోట్లు దారిమళ్లాయన్న కేసులో ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారి సన్నిహితుల నుంచి ఇంత డబ్బు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. 

రూ.2,000, రూ.500, రూ.200, రూ.100 నోట్లు కట్టలకొద్దీ వెలుగు చూశాయి. మరోవైపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గత నెలలో కుంతి జూనియర్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్ అయిన రామ్ ప్రసాద్ సిన్హాను ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు అతడిపై 16 ఎఫ్ఐఆర్ లు నమోదు కావడం గమనార్హం. దర్యాప్తులో భాగంగా పూజా సింఘాల్ తో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారుల పేర్లను అతడు వెల్లడించాడు. ప్రస్తుతం ఆమె ఝార్ఖండ్ మైనింగ్, జియాలజీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News