Mosque: కాశీ విశ్వనాథుడి ఆలయం పక్కనే ఉన్న మసీదులో సర్వే
- కోర్టు నియమించిన కమిషనర్, లాయర్ల పరిశీలన
- స్థానిక కోర్టు ఆదేశాల మేరకు నిర్వహణ
- మే 10 నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కోర్టు
వారణాసిలోని విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న మసీదును కోర్టు నియమించిన కమిషనర్, న్యాయవాదులు పరిశీలించారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం మసీదు వెలుపలి భాగాన్ని ఈ బృందం అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భద్రతను కల్పించారు. శనివారం కూడా ఈ పరిశీలన కొనసాగనుంది.
ఈ మసీదుకు ముందు అక్కడ హిందూ మందిరం ఉందంటూ, ఏడాది పాటు సందర్శనకు అనుమతించాలంటూ స్థానిక కోర్టులో గతేడాది ఒక పిటిషన్ దాఖలైంది. దీంతో మసీదు ప్రాంతాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలంటూ స్థానిక కోర్టు ఒకటి ఆదేశించింది. ఇందుకు ఒక కమిషనర్ ను నియమించింది. మసీదు పశ్చిమ భాగంలో ఉన్న మా శృంగార్ గౌరీ స్థలాన్ని ఏడాది అంతటా సందర్శించేందుకు అనుమతించాలని మహిళలు తమ పిటిషన్ లో కోరారు. ప్రస్తుతం ఇక్కడ ఏడాదికి ఒక్కసారే అనుమతిస్తున్నారు.
దీంతో సదరు స్థలాన్ని పరిశీలించడంతోపాటు, వీడియోలు తీసి మే 10 నాటికి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే, సదరు మసీదు నిర్వహణ కమిటీ మసీదు లోపల వీడియోలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. మసీదు ప్రాంతాన్ని పరిశీలించేందుకు స్థానిక కోర్టు ఇచ్చిన ఆదేశాలను మసీదు సంరక్షణ కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేయడం గమనార్హం.