Roja: అల్లూరి సీతారామరాజు ఆశయాలను నెరవేరుస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ గారు: మంత్రి రోజా
- నేడు అల్లూరి వర్ధంతి
- విశాఖలో కార్యక్రమం
- హాజరైన కిషన్ రెడ్డి, రోజా
- సీఎం జగన్ పై రోజా ప్రశంసలు
నేడు మన్యం వీరుడు, తెల్లదొరల పాలనపై విల్లు ఎక్కుపెట్టిన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి. విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పాల్గొన్నారు. కిషన్ రెడ్డి, రోజా విశాఖలో అల్లూరి విగ్రహానికి పూలదండలు వేసి, ఆ మహనీయునికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... "అల్లూరి సీతారామరాజు అన్న పేరు వింటేనే అందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన బతికింది 27 ఏళ్లే అయినా, 27 తరాలు గుర్తుపెట్టుకునే విధంగా స్ఫూర్తి కలిగించారు. ఇవాళ ఆయన పేరిట జిల్లాకు కూడా పేరుపెట్టుకున్నాం. ఆయన చనిపోయి 100 ఏళ్లు అయిందనుకుంటున్నా, నిజానికి ఆయనకు మరణం లేదు" అని కీర్తించారు. అంతేకాదు, అల్లూరి సీతారామరాజు గారి ఆశయాలను నెరవేరుస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ గారు అని కొనియాడారు.
అల్లూరి స్ఫూర్తితో, ఆయన కోరుకున్న విధంగా మన్యం ప్రజలకు హక్కులు కల్పించడంలో గానీ, వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంలో గానీ, వారిని అభివృద్ధి పథంలోకి నడిపించాలని అల్లూరి కన్న కలలన్నీ నేడు జగన్ గారు నెరవేరుస్తున్నారని రోజా వివరించారు. ఇక, అల్లూరి సీతారామరాజు పేరిట మ్యూజియం కట్టడం కోసం 22 ఎకరాల స్థలం కేటాయించారని, మ్యూజియం నిర్మాణం కోసం అన్ని విధాలా సహకరిస్తున్న కిషన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని రోజా వెల్లడించారు.