Shane Watson: ధోనీ జట్టులో ఉండగా మరొకరు కెప్టెన్ గా వ్యవహరించడమా..?: షేన్ వాట్సన్
- ఐపీఎల్ సీజన్ ఆరంభంలో చెన్నై కెప్టెన్ గా జడేజా
- చెన్నై జట్టుకు దారుణ పరాజయాలు
- కెప్టెన్సీ నుంచి తప్పుకున్న జడేజా
- ధోనీకే మళ్లీ సారథ్య బాధ్యతలు
- స్పందించిన షేన్ వాట్సన్
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ వ్యవహారంపై ఆ జట్టు మాజీ ఆటగాడు, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వాట్సన్ స్పందించాడు. సీజన్ ఆరంభంలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రవీంద్ర జడేజా.... వరుస ఓటముల నేపథ్యంలో ధోనీకే మళ్లీ కెప్టెన్సీ ఇచ్చేయడంపై వాట్సన్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
"జడేజా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఎంపికయ్యాడన్న వార్తలతో నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, ధోనీ మైదానంలో ఉంటే అతడి పట్ల ఆటగాళ్లలో ఉండే గౌరవం, ఆటగాళ్లపై అతడికుండే నియంత్రణ, నాయకుడిగా అతడి ఘనమైన చరిత్ర అందరికీ తెలిసిందే. ఈ విషయంలో జడేజాను ధోనీతో పోల్చుకోలేం.
ఒకవేళ ధోనీ గాయపడితేనో, ఓ మ్యాచ్ లో విశ్రాంతి తీసుకుంటేనో జట్టు సారథ్య బాధ్యతలు వహించడం వేరు... జట్టులో ధోనీ ఉండగానే కెప్టెన్సీ నిర్వర్తించడం వేరు. అందుకే జడేజాను కొత్త కెప్టెన్ గా నియమించారని తెలియగానే అతడికిది గొప్ప అవకాశం అనిపించినా, ఆ వెంటనే అతడి పట్ల సానుభూతి కలిగింది. జడేజా ఎంతో ప్రతిభావంతుడైన క్రికెటరే. క్రమంగా ఆటతీరును మెరుగుపర్చుకుంటున్న ఆటగాడే. కానీ తనను తాను ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చూసుకోవడం అతనికి చాలా కష్టమైన వ్యవహారంగా మారిందనుకుంటున్నాను.
అసలు, జడేజా ఇంత వరకు తెచ్చుకోకుండా ఉండాల్సింది. తీవ్రమైన ఒత్తిడిలో కెప్టెన్సీని వదులుకుంటున్నట్టు ప్రకటించడం కీలక నిర్ణయంగానే భావిస్తాను. అదే సమయంలో ధోనీ మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు అందుకోడం సరైన చర్య. మరీ అవమానకర పరిస్థితుల్లో ఉన్నామని భావించినప్పుడు కెప్టెన్సీ వదులుకోవడం మంచి నిర్ణయమే. జడేజాను అందుకు అభినందిస్తున్నా. గతంలో నేను కూడా ఇలాగే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా వైదొలిగాను. ప్రతికూల పరిస్థితుల్లో తన పట్ల తాను నిర్ణయం తీసుకున్న వైనం జడేజా పట్ల గౌరవాన్ని పెంచింది" అంటూ షేన్ వాట్సన్ వివరించాడు.