Disha: దిశ యాప్ అమలుకు 18 రాష్ట్రాల అడుగులు: ఏపీ మంత్రి ధర్మాన
- మహిళల భద్రతకు ఏపీలో దిశ యాప్
- యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న లక్షల మంది మహిళలు
- యాప్ ద్వారా జగన్ దేశానికే దిశానిర్దేశం చేశారన్న ధర్మాన
ఏపీలో మహిళల భద్రత కోసం వైసీపీ ప్రభుత్వం దిశ పేరిట ఓ ప్రత్యేక యాప్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నవారు... తాము ప్రమాదంలో ఉంటే తమ మొబైల్ ద్వారా ఎక్కడున్నా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఆ ఫిర్యాదును స్వీకరించే పోలీసులు... బాధితులు ఉన్న ప్రాంతానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను అలర్ట్ చేయడం ద్వారా... బాధితుల మొబైల్ లొకేషన్ ఆధారంగా నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకునే వెసులుబాటు ఉంది. ఈ యాప్‌ను ఇప్పటికే లక్షల మంది మహిళలు తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నట్లు సర్కారు తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ యాప్‌పై శనివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో దిశ యాప్ ద్వారా సీఎం జగన్ దేశానికే దిశానిర్దేశం చేశారని ఆయన పేర్కొన్నారు. ఏపీ తరహాలో దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు దిశ యాప్ అమలుచేసే దిశగా అడుగులు వేస్తున్నాయని కూడా ధర్మాన తెలిపారు.