Kolkata Knight Riders: లక్నో బౌలర్లకు తలవంచిన కోల్‌కతా.. ఘోర పరాజయం

Pace bowlers fire LSG to crushing win

  • టాప్ ప్లేస్‌కు చేరుకున్న లక్నో
  • 75 పరుగుల భారీ తేడాతో ఓడిన కోల్‌కతా
  • కోల్‌కతా కథ ఇక ముగిసినట్టే
  • అవేశ్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

ఐపీఎల్‌లో నయా జట్టు లక్నో సూపర్ జెయింట్స్ చెలరేగిపోతోంది. వరుస విజయాలతో దుమ్ము రేపుతోంది. గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 75 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన రాహుల్ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మరోవైపు, ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ కథ ఇక ముగిసినట్టే. డికాక్, దీపక్ హుడా మెరవడంతో తొలుత 176 పరుగుల భారీ స్కోరు సాధించిన లక్నో ఆ తర్వాత బంతితో కోల్‌కతాను చిత్తు చేసింది.

177 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా ఏ దశలోనూ విజయం దిశగా సాగలేకపోయింది. అవేశ్ ఖాన్, జాసన్ హోల్డర్ నిప్పులు చెరిగే బంతుల ముందు కోల్‌కతా బ్యాటర్లు నిలవలేకపోయారు. క్రీజులోకి వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లారు. ఏకంగా 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. వారిలో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఆండ్రూ రసెల్ మాత్రం 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 45 పరుగులు చేసి కాసేపు మెరుపులు మెరిపించాడు.  సునీల్ నరైన్ 22, అరోన్ ఫించ్ 14 పరుగులు చేశారు. బంతిని ఎదుర్కోవడంలో దారుణంగా విఫలమైన కోల్‌కతా 14.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. 11 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్‌కు ఇది ఏడో పరాజయం. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్‌, జాసన్ హోల్డర్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డి కాక్ (29 బంతుల్లో 50 పరుగులు), దీపక్ హుడా (27 బంతుల్లో 41 పరుగులు) రాణించారు. కృనాల్ పాండ్యా 25, స్టోయినిస్ 28, బడోని 15, హోల్డర్ 13 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో రసెల్‌కు రెండు వికెట్లు దక్కాయి. బంతితో చెలరేగిన లక్నో బౌలర్ అవేశ్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ కేపిటల్స్ తలపడతాయి.

  • Loading...

More Telugu News