Madhya Pradesh: ఏడుగురు సజీవ దహనమైన కేసులో షాకింగ్ ట్విస్ట్.. ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందని భవనానికి నిప్పు పెట్టిన యువకుడు!
- మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘటన
- నిన్న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘాతుకం
- బైక్‌కు నిప్పంటించి పరారైన యువకుడు
- తొలుత షార్ట్ సర్క్యూట్‌గా నిర్ధారించిన పోలీసులు
- సీసీటీవీల పరిశీలనతో అసలు విషయం వెలుగులోకి
- పరారీలో నిందితుడు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిన్న తెల్లవారుజామున ఓ భవనంలో మంటలు అంటుకుని ఏడుగురు మృతి చెందిన కేసులో ఒళ్లు జలదరించే షాకింగ్ ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. నగరంలోని రద్దీ ప్రాంతమైన విజయ్‌నగర్‌లో మూడంతస్తుల భవనం కాలిబూడిదైంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో 9 మంది చికిత్స పొందుతున్నారు. ఎలక్ట్రిక్ మీటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు పార్క్ చేసిన వాహనాలకు అంటుకుని ఆపై భవనానికి పాకినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.
అయితే, ఆ తర్వాత 50 సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు ఇది ప్రమాదం కాదని, ఓ యువకుడి పని అని తేల్చారు. ఆ భవనంలో నివసిస్తున్న అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతోనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు నిర్ధారించి షాకయ్యారు. నిందితుడిని సంజయ్ అలియాస్ శుభం దీక్షిత్ (27)గా గుర్తించారు. నిన్న తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న సంజయ్ అక్కడ పార్క్ చేసి ఉన్న ఓ స్కూటర్‌కు నిప్పు పెట్టాడు. క్షణాల్లోనే చెలరేగిన మంటలు అక్కడ పార్క్ చేసిన ఇతర వాహనాలకు అంటుకుని ఆపై భవనానికి పాకాయి.
అందులో నివసిస్తున్న వారు ఊపిరి ఆడక మంటల్లో కాలి బూడిదయ్యారు. కొందరు మాత్రం బాల్కనీల్లోంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, స్కూటర్‌కు మంట పెట్టి వెళ్లిన సంజయ్ ఓ గంట తర్వాత మళ్లీ భవనం వద్దకు వచ్చాడు. అక్కడున్న సీసీటీవీలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. వీలుకాకపోవడంతో పరారయ్యాడు. యువకుడు ప్రేమించిన యువతి సురక్షితంగానే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం వేట ప్రారంభించామని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని పేర్కొన్నారు.