Telangana: ఉపరితల ద్రోణి ప్రభావం.. తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
- రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం
- నేటి నుంచి నాలుగు రోజులపాటు పెరగనున్న ఉష్ణోగ్రతలు
- మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకపోవడమే మేలంటున్న వాతావరణశాఖ
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి కర్ణాటక వరకు గాలుల్లో ఏర్పడిన అస్థిరత కారణంగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది.
అలాగే, నేటి నుంచి నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వడగాలులు వీచే అవకాశం ఉండడంతో మధ్యాహ్నం పూట బయటకు రాకుండా ఉండడమే మేలని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, నిన్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అత్యధికంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వివరించింది.