Lucknow super gaints: ప్రమాదకరంగా మారుతున్న లక్నో పేస్ బౌలింగ్
- నలుగురు బౌలర్ల మధ్య సమన్వయం
- కలసికట్టుగా ఫలితాలు రాబట్టేందుకు కృషి
- మ్యాచ్ తర్వాత వెల్లడించిన అవేశ్ ఖాన్
ఐపీఎల్ 2022 సీజన్ లో రెండు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ సత్తా చూపిస్తున్నాయి. తొలుత గుజరాత్ టైటాన్స్ తో మొదటి మ్యాచ్ లో లక్నో ఓటమి పాలైంది. దీంతో ఈ జట్టుపై ఆరంభంలో పెద్ద అంచనాలు లేవు. కానీ, ఒక్కో మ్యాచ్ సాగుతున్న కొద్దీ ఈ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో బలపడుతూ వస్తోంది. ముఖ్యంగా లక్నో బౌలింగ్ మరింత పదును తేలుతోందని గత వరుస విజయాలను పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు.
అవేశ్ ఖాన్, జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, మోహిసిన్ ఖాన్ ఈ చతుష్టయం బాల్ తో ప్రత్యర్థి జట్లను కట్టడి చేస్తున్నారు. శనివారం నాడు కోల్ కతా జట్టుపై లక్నో విజయం తర్వాత పేసర్ అవేశ్ ఖాన్ మాట్లాడుతూ.. తాము నలుగురం ఎంతో చక్కని అనుబంధంతో సాగుతున్నట్టు చెప్పాడు. ఒకరికొకరం జ్ఞానాన్ని పంచుకుంటున్నామని, దీంతో ఒత్తిడితో కూడిన మ్యాచ్ ల్లో మంచి ఫలితాలు రాబడుతున్నట్టు తెలిపాడు.
‘‘చమీర, మోహిసిన్ మంచి ఆరంభాన్నిచ్చారు. దీంతో నాపై ఒత్తిడి తగ్గిపోయింది. మేము అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఒకరికొకరం మద్దతుగా ఉంటాం. ఎలా చేస్తే బావుంటుందో టైమ్ అవుట్ (బ్రేక్) సమయంలో చర్చించుకుంటాం’’అంటూ తాము కలసికట్టుగా విజయం కోసం ఎలా నడుచుకుంటున్నామో అవేశ్ ఖాన్ వెల్లడించాడు. 11 మ్యాచ్ లకు గాను 8 విజయాలతో లక్నో జట్టు నంబర్ 1 స్థానానికి చేరడం గమనార్హం.