Tamilisai Soundararajan: గవర్నర్‌గా నన్ను నియమించినప్పుడు చాలా మంది అనుమానపడ్డారు: తమిళిసై
- ఎటువంటి అనుభవమూ లేదని అన్నారన్న తమిళిసై
- తనపై విమర్శలు వచ్చాయని వివరణ
- తనకు గైనకాలజిస్టుగా అనుభవం ఉందని వ్యాఖ్య
- గవర్నర్ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నానని వివరణ
హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన మాతృదినోత్సవ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణకు గవర్నర్ గా తనను నియమించినప్పుడు చాలా మంది అనుమానపడ్డారని, తనకు ఎటువంటి అనుభవమూ లేదని తనపై విమర్శలు వచ్చాయని చెప్పారు. అయితే, తనకు గైనకాలజిస్టుగా శిశువులకు చికిత్స అందించడంలో అనుభవం ఉందని తెలిపారు.
ఆ వృత్తి ఇచ్చిన ధైర్యంతోనే గవర్నర్ గా ముందుకెళ్తున్నట్లు ఆమె చెప్పారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ గవర్నర్ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కూడా నవజాత శిశువు అని వ్యాఖ్యానించారు. రాజ్‌భవన్‌లో ఈ రోజు రెడ్‌క్రాస్ డే వేడుకలు జరిగాయి. ఆ కార్యక్రమంలోనూ తమిళిసై మాట్లాడారు.
కొవిడ్ సమయంలో పోలీసులు, సైనికులు చాలా సహకరించారని ఆమె తెలిపారు. వారు రక్తాన్ని అవసరమైన వారికి సాయం చేయడంలో కృషి చేశారని వివరించారు. రెడ్‌క్రాస్ సంస్థ తమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి, అన్ని జిల్లాల్లో తమ కార్యకలాపాలు నిర్వహించాలని ఆమె చెప్పారు.