Crime News: బిజీ రోడ్డులో కారుపై దుండగుల కాల్పులు.. వెనక్కు తిరిగి వెళ్లిపోయిన వాహనదారులు.. దారుణ ఘటన వీడియో ఇదిగో
- ఢిల్లీలోని సుభాష్ నగర్ లో ఘటన
- అన్నాదమ్ములిద్దరికి తీవ్రగాయాలు
- వారి పరిస్థితి విషమం
చుట్టూ జనం.. వచ్చిపోయే వాహనాలతో బిజీబిజీగా రోడ్డు.. అందరి కళ్ల ముందే ఓ కారుపై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. కానీ, ఏ ఒక్కరూ స్పందించలేదు. ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ షాకింగ్ ఘటన ఢిల్లీలోని సుభాష్ నగర్ లో నిన్న రాత్రి జరిగింది. కాల్పుల్లో ఇద్దరు అన్నాదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన గురించి స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. కాల్పుల్లో గాయపడిన బాధితులను కేశోపూర్ మండి మాజీ చైర్మన్ అజయ్ చౌదరీ, అతడి సోదరుడు జస్సా చౌదరీగా గుర్తించారు. ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తీహార్ గ్రామంలో అజయ్ చౌదరీ నివసిస్తూ ఉంటారని, ఆసుపత్రిలో ఉన్న బంధువులను చూసి వచ్చేందుకు తన తమ్ముడితో కలిసి కారులో వెళుతుండగా దుండగులు 10 రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు.
పరారైన నిందితుల కోసం గాలిస్తున్నామని, వారు దొరికాక కాల్పులకు గల కారణాలను వెల్లడిస్తామని చెప్పారు. ఘటన నేపథ్యంలో సుభాష్ నగర్ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు ఘటన జరుగుతున్న సమయంలో వాహనదారులు అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఎక్కడో దూరం నుంచే యూ టర్న్ తీసుకుని వెనక్కు వెళ్లిపోవడం వీడియోలో కనిపించింది.