Jogi Ramesh: బీజేపీతో ఉంటూ చంద్రబాబుకు సంకేతాలు ఇస్తున్న పవన్ కల్యాణ్ ను రాజకీయ వ్యభిచారి అనక ఇంకేమనాలి?: మంత్రి జోగి రమేశ్
- పొత్తు వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
- వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వరాదని వెల్లడి
- ఘాటుగా స్పందించిన మంత్రి జోగి రమేశ్
- చంద్రబాబు, పవన్ అక్రమపొత్తు ఎప్పటినుంచో ఉందని విమర్శలు
- తమకొచ్చే నష్టమేమీ లేదని స్పష్టీకరణ
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నంద్యాలలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి జోగి రమేశ్ స్పందించారు. వైసీపీ వ్యతిరేక ఓటు అంశంపైనా, పొత్తులపై పవన్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిపై జోగి రమేశ్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి అని ఘాటుగా విమర్శించారు. ఓ వైపున బీజేపీ భాగస్వామిగా ఉంటూ, మరోవైపు చంద్రబాబుకు సంకేతాలు పంపిస్తున్న పవన్ కల్యాణ్ ను అంతకంటే ఇంకేమనాలని జోగి రమేశ్ ప్రశ్నించారు.
అయినా, పవన్, చంద్రబాబు ఇవాళ కొత్తగా కలిసేదేమీ లేదని, వారిద్దరి మధ్య అక్రమ పొత్తు ఎప్పటినుంచో ఉందని అన్నారు. చంద్రబాబు, పవన్ పార్టీల పొత్తుతో తమకొచ్చే నష్టమేమీ లేదని జోగి రమేశ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. తమకు ఎలాంటి సుపరిపాలన అందుతోందన్నది ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని పవన్ అంటున్నారని, అది నిజమేనని, వైసీపీ 151కి పైగా స్థానాలను చేజిక్కించుకోవడమే ఆ అద్భుతం అని జోగి రమేశ్ వెల్లడించారు. అంతేతప్ప, పవన్ మనసులో అనుకుంటున్న విధంగా ఏదీ జరగదని స్పష్టం చేశారు.