Balineni Srinivasa Reddy: చంద్రబాబుకు సొంత పార్టీపైనే నమ్మకం లేదు... అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు: బాలినేని
- ఏపీలో విపక్షాల నోట పొత్తుల మాట
- స్పందించిన మాజీ మంత్రి బాలినేని
- ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా జగన్ ను ఓడించలేరని ధీమా
ఏపీలో విపక్షాలు ప్రధానంగా పొత్తుల గురించే మాట్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. చంద్రబాబు అనేక సంవత్సరాలు సీఎంగా పనిచేశారని, అయినప్పటికీ ఆయనకు సొంత పార్టీపై నమ్మకం లేదని విమర్శించారు. అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని వెల్లడించారు. ఏ పార్టీ ఎవరితో కలిసినా, ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా జగన్ ను ఏమీ చేయలేరని బాలినేని స్పష్టం చేశారు.
ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబుకు పొత్తు కావాల్సిందేనని ఎద్దేవా చేశారు. తాను గెలుస్తానో, లేదో అన్న అభద్రతాభావం చంద్రబాబులో ఉందని న్నారు. కానీ జగన్ సొంతంగా పార్టీ పెట్టి, ఒక్కడే పోరాడి అధికారంలోకి వచ్చారని తెలిపారు. కానీ చంద్రబాబుకు ఆ ధైర్యం లేదని, ఇతర పార్టీల పొత్తు కోరినప్పుడే జగన్ ను ఎదుర్కోలేకపోతున్నారన్న విషయం స్పష్టమైందని బాలినేని వ్యాఖ్యానించారు.