Imran Khan: అమెరికా డిమాండ్ కు నేనెప్పుడూ తలొగ్గలేదు: ఇమ్రాన్ ఖాన్
- ఇటీవల ప్రధాని పదవి నుంచి వైదొలిగిన ఇమ్రాన్
- ప్రవాస పౌరులను ఉద్దేశించి వీడియో సందేశం
- పాక్ సైనిక స్థావరాలను అమెరికా అడిగిందని వెల్లడి
సొంత పార్టీలోనే అసమ్మతి ఎదురవడంతో పదవి నుంచి దిగిపోయిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా పాకిస్థాన్ ప్రవాస పౌరులను ఉద్దేశించి ఓ వీడియో సందేశం వెలువరించారు. పాకిస్థాన్ లోని సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న అమెరికా డిమాండ్ కు తాను ఎప్పుడూ తలొగ్గలేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలు వైదొలిగాక, పాక్ సైనిక స్థావరాలను అమెరికా కోరిందని, కానీ తాను అధికారంలో ఉన్నంత వరకు అందుకు ఒప్పుకోలేదని అన్నారు.
"ఆఫ్ఘనిస్థాన్ లో మళ్లీ ఉగ్రవాదం పేట్రేగితే తక్షణమే స్పందించేందుకు వీలుగా పాక్ లోని సైనిక స్థావరాలను ఉపయోగించుకుంటామని అమెరికా కోరింది. కానీ అమెరికా ప్రతిపాదన నాకు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా అనిపించలేదు. ఉగ్రవాదంపై అమెరికా పోరులో 80 వేల మంది వరకు పాకిస్థానీలు ప్రాణాలు కోల్పోయారు. కానీ పాక్ ప్రజల త్యాగాలను ఎప్పుడూ అభినందించకపోగా, అమెరికా రాజకీయవేత్తలు మనల్నే తప్పుబడుతున్నారు. ఇప్పటికే దేశంలోని గిరిజన ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పుడు మన సైనిక స్థావరాలు అడుగుతున్నారు. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించలేదు" అని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.