CSK: కాన్వే వీరవిహారం... చెన్నై భారీ స్కోరు
- ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ టార్గెట్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 రన్స్ చేసిన చెన్నై
- 49 బంతుల్లో 87 పరుగులు చేసిన కాన్వే
- 7 ఫోర్లు, 5 సిక్సులు బాదిన వైనం
ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ఓపెనర్ డెవాన్ కాన్వే సిక్సర్ల మోత మోగించడంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. 49 బంతులు ఎదుర్కొన్న కాన్వే 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సైతం ధాటిగా ఆడాడు. గైక్వాడ్ 33 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 41 పరుగులు చేశాడు.
వన్ డౌన్ లో వచ్చిన యువ ఆటగాడు శివమ్ దూబే మరింత దూకుడుగా ఆడి 19 బంతుల్లోనే 32 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. చివర్లో వచ్చిన కెప్టెన్ ధోనీ సైతం బ్యాట్ ఝుళిపించడంతో చెన్నై స్కోరు 200 దాటింది. ధోనీ 8 బంతుల్లోనే 1 ఫోర్, 2 సిక్సులతో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో ఆన్రిచ్ నోర్జే 3 వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్ 2, మిచెల్ మార్ష్ ఒక వికెట్ పడగొట్టారు.