Peddireddi Ramachandra Reddy: కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్నారు.. అయినా ఈ సారి ఓడిపోవడం ఖాయం: మంత్రి పెద్దిరెడ్డి
- పొత్తు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేరన్న పెద్దిరెడ్డి
- ఇప్పుడు పవన్ తో పొత్తు పెట్టుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శ
- ప్రజలకు ఏం చేశారని చంద్రబాబుకు ఓట్లు వేయాలని ప్రశ్న
టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లిన దాఖలాలు లేనే లేవని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 2019 ఎన్నికల్లో మాత్రమే పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లారని... అందువల్లే ఘోరంగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఈ అంశాన్ని గమనించిన చంద్రబాబు ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఇప్పటికే చంద్రబాబుతో పవన్ కల్యాణ్ అనైతిక కలయికలో ఉన్నారని... ఇప్పుడు నైతికంగా కలిసి ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారని చెప్పారు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా తమకు అనవసరమని... జగన్ నాయకత్వంలో వైసీపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందని అన్నారు.
అసలు చంద్రబాబు ప్రజలకు ఏం చేశారని ఓట్లు వేయాలని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. జగన్ ను, వైసీపీని తిట్టడమే టీడీపీ అజెండాగా కనిపిస్తోందని విమర్శించారు. వీరికి పచ్చ మీడియా పూర్తి స్థాయిలో సహకరిస్తోందని చెప్పారు.
ఇన్నేళ్లుగా కుప్పంలో ఇల్లు కట్టుకోని చంద్రబాబు ఇప్పుడు కట్టుకోవాలనుకుంటున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని అన్నారు. ఏపీలో మెరుగైన విద్యుత్ ను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎక్కడా విద్యుత్ కోతలు లేవని... రైతులకు నిరంతర విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. పరిశ్రమలకు మాత్రం కొంతమేర విద్యుత్ కోతలు తప్పవని చెప్పారు.