karnataka: లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా.. కర్ణాటకలోని ఆలయాల్లో మొదలు
- మైసూరు, మాండ్య, బెల్గావి జిల్లా ఆలయాల్లో అమలు
- ఉదయం 5 నుంచే మోతెక్కిన లౌడ్ స్పీకర్లు
- చట్ట ప్రకారం నడుచుకోవాలన్న శ్రీరామ్ సేన
మసీదుల్లో అజాన్ ను లౌడ్ స్పీకర్ల నుంచి పెద్దగా వినిపించడాన్ని వ్యతిరేకిస్తూ.. కర్ణాటక రాష్ట్రంలో కొన్ని ఆలయాలు ప్రతిస్పందన చర్యలకు దిగాయి. కర్ణాటక వ్యాప్తంగా అన్ని ఆలయాలు ఉదయం వేళల్లో హనుమాన్ చాలీసా పారాయణం పెట్టాలని శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ ఒక రోజు ముందే పిలుపునిచ్చారు. దీంతో పలు ప్రాంతాల్లోని ఆలయాలు ఉదయం 5 గంటల నుంచి హనుమాన్ చాలీసా పారాయణాన్ని లౌడ్ స్పీకర్ల ద్వారా వినిపిస్తున్నాయి.
బెంగళూరు, మాండ్య, బెల్గామ్, ధార్వాడ్, కలబురగి జిల్లాల్లోని ఆలయాల్లో హన్ మాన్ చాలీసా, మంత్ర పఠనం, ఇతర వేద మంత్ర పారాయణాన్ని ఆడియో రూపంలో పెట్టారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాదిరే.. సీఎం బస్వరాజ్ బొమ్మై, హోంశాఖ మంత్రి అరంగ జ్ఞానేంద్ర తమ ధైర్యాన్ని ప్రదర్శించాలని ప్రమోద్ ముతాలిక్ కోరారు. యూపీలో అనధికారికంగా నడుస్తున్న లౌడ్ స్పీకర్లను తొలగించడం, అనుమతులు ఉన్న వాటికి నిబంధనల మేరకు శబ్ద పరిమితులు విధించడాన్ని ముతాలిక్ ప్రస్తావించారు.