Shoaib Akhtar: ధోనీ ఏదైనా చేయగలడు.. మనం ఊహించలేం: షోయబ్ అక్తర్

Shoaib Akhtar makes huge claim about MS Dhonis IPL future He can do any odd stuff
  • మరో సీజన్ పాటు ధోనీ చెన్నైకి ఆడొచ్చన్న అక్తర్ 
  • లేదంటే చెన్నై మేనేజ్ మెంట్ లో భాగం కావచ్చని వ్యాఖ్య 
  • వచ్చే ఏడాది వారు మరింత బలంగా వస్తారన్న అక్తర్
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ‘‘అతడు ఎంఎస్ ధోనీ. ఆయన ఏం చేస్తాడన్నది నిజంగా ఊహించలేము. ఏదైనా బిన్నంగా చేయగలడు. ఆ విషయంలో అతడు ప్రసిద్ధుడు. గొప్ప వ్యక్తి కూడా. మేమంతా అతడ్ని గౌరవిస్తాం, ప్రేమిస్తాం. వ్యక్తిగతంగా అయితే ధోనీ మరో సీజన్ పాటు ఐపీఎల్ లో ఆడతాడని అనుకుంటున్నాను. లేదంటే మేనేజ్ మెంట్ లో భాగం కావచ్చు’’ అని షోయబ్ అక్తర్ ఓ స్పోర్ట్స్ పత్రికకు చెప్పాడు. 

ధోనీ వచ్చే సీజన్ కు కూడా తనను చెన్నై జెర్సీలో చూస్తారని ప్రకటించడం తెలిసిందే. కాకపోతే తాను మైదానంలో ఆడేదీ, లేదంటే జట్టు మేనేజ్ మెంట్ లో భాగంగా డగౌట్స్ లో కూర్చొనేదీ ధోనీ ప్రకటించలేదు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ సీజన్ కు ముందు కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడం, రవీంద్ర జడేజాకు ఆ బాధ్యతలు అప్పగించడం తెలిసిందే. 

కానీ, ఇచ్చిన బాధ్యతల్లో జడేజా తాను నిరూపించుకోలేకపోయాడు. బ్యాటింగ్ ఫామ్ కూడా కోల్పోయాడు. 8 మ్యాచులకు రెండింట్లోనే విజయం సాధించిన క్రమంలో జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ధోనీ తిరిగి ఆ బాధ్యతలను స్వీకరించి అన్ని విషయాలపై దృష్టి సారించడం తెలిసిందే. పైగా కెప్టెన్ గా ధోనీ మూడు మ్యాచుల్లో రెండింటిలో గెలిపించాడు. 

‘‘చెన్నై ఆరంభంలోనే డకౌట్ కావడం చాలా అరుదు. ప్రతి సీజన్ పై వారి ప్రభావం ఉంటుంది. సీఎస్కేకు ఈ విడత కిచెన్ లో వండేందుకు ఎంతో మంది వంటవాళ్లు ఉన్నారు. తిరిగి గ్రూపుగా ఫామ్ అయ్యేందుకు వారికి సమయం కావాలి. ఈ సీజన్ లో ఇప్పటికే ఆలస్యం అయింది. స్పష్టమైన ఆలోచన, విధానంతో వచ్చే సీజన్ కు వారు మరింత బలంగా వస్తారు’’ అని అక్తర్ తెలిపాడు.
Shoaib Akhtar
MS Dhoni
IPL future

More Telugu News