Mohammad Rizwan: టీ20 వరల్డ్ కప్ సెమీస్ ముందు నిషిద్ధ పదార్థాన్ని తీసుకున్న పాకిస్థాన్ క్రికెటర్ రిజ్వాన్
- గతేడాది యూఏఈ వేదికగా టీ20 వరల్డ్ కప్
- సెమీస్ వరకు దూసుకొచ్చిన పాక్
- పాక్ విజయాల్లో రిజ్వాన్ కీలకపాత్ర
- సెమీస్ కు ముందు ఐసీయూలో చికిత్స
ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఎంతో బలమైన జట్టుగా ఎదిగింది. పాక్ విజయాల్లో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహ్మద్ రిజ్వాన్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ రిజ్వాన్ విశేషంగా రాణించాడు. రిజ్వాన్ కీలకమైన సెమీస్ మ్యాచ్ కు ముందు తీవ్ర ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యాడు. ఐసీయూలో చికిత్స పొంది కూడా ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్ కు బరిలో దిగి అందరి అభినందనలు అందుకున్నాడు. అనారోగ్య పరిస్థితుల్లో మ్యాచ్ ఆడడమే కాదు, 52 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు.
అయితే, ఆ మ్యాచ్ సందర్భంగా ఏంజరిగిందో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచలన నిజం బయటపెట్టింది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ కు ముందు మహ్మద్ రిజ్వాన్ నిషిద్ధ పదార్థాన్ని తీసుకున్నాడని పీసీబీ వైద్యుడు నజీబుల్లా సూమ్రో తెలిపారు. అయితే, ఆ నిషేధిత పదార్థాన్ని తీసుకునేందుకు రిజ్వాన్ ఐసీసీ నుంచి అనుమతి తీసుకున్నాడని వెల్లడించారు.
"రిజ్వాన్ ఆ సమయంలో చాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడ్డాడు. ఆ నిషిద్ధ పదార్థాన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తేనే అతడి అనారోగ్యానికి విరుడుగు. మరో మార్గం లేదు. సాధారణంగా ఆ పదార్థాన్ని క్రీడాకారులు వినియోగించడంపై నిషేధం ఉంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లోనే రిజ్వాన్ కు పదార్థం వాడడం జరిగింది. అందుకు సంబంధించిన అనుమతిని ఐసీసీ నుంచి తీసుకున్నాం" అని డాక్టర్ సూమ్రో వివరించారు.
కాగా, టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో రిజ్వాన్ మూడోవాడు. 6 మ్యాచ్ ల్లో 70.25 సగటుతో 281 పరుగులు చేశాడు.