Amarakeerthi Athukorala: శ్రీలంకలో దారుణ పరిస్థితులు... శవమై కనిపించిన అధికార పార్టీ ఎంపీ
- కొలంబో వెలుపల నిరసనలు
- కారులో వచ్చిన ఎంపీ అమరకీర్తి
- అడ్డుకున్న ఆందోళన కారులు
- తుపాకీ తీసి కాల్పులు జరిపిన ఎంపీ
- ఓ భవనంలో తలదాచుకునే యత్నం
- ఆపై ఆత్మహత్య
శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ విషమిస్తున్నాయి. తాజాగా, ఆందోళనకారులతో జరిగిన ఘర్షణలు అధికార పార్టీ ఎంపీ మరణానికి దారితీశాయి. ప్రజాపాలనపై ప్రభుత్వం అదుపు కోల్పోతోందనడానికి ఈ ఘటనే నిదర్శనం. కొలంబో రాజధాని వెలుపల నిట్టంబువా ప్రాంతంలో ఆందోళనకారులు భారీ ఎత్తున గుమికూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
ఆ సమయంలో ఎంపీ అమరకీర్తి అతుకోరల తన కారులో అక్కడికి వచ్చారు. ఎంపీని చూడగానే ఆగ్రహంతో ఆందోళనకారులు ఆయన కారును చుట్టుముట్టారు. దాంతో ఎంపీ తుపాకీ తీసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆందోళనకారుల నుంచి తప్పించుకుని సమీపంలోని భవనంలో ఆశ్రయం పొందేందుకు ఎంపీ అమరకీర్తి ప్రయత్నించారు. కాసేపటి తర్వాత ఆయన శవమై కనిపించారు. తన తుపాకీతో తానే కాల్చుకున్నట్టు భావిస్తున్నారు. అదే సమయంలో ఆయన సెక్యూరిటీ గార్డు కూడా చనిపోయి కనిపించాడు. కాగా, ఎంపీ కాల్పుల్లో గాయపడిన పౌరుల్లో ఒకరు మరణించారు.
శ్రీలంకలో సంక్షోభం మొదలయ్యాక, కొలంబోలో నేడు అత్యంత తీవ్రస్థాయిలో హింస చెలరేగింది. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు ప్రయోగించాల్సి వచ్చింది. తక్షణమే కొలంబోలో కర్ఫ్యూ ప్రకటించారు. కాగా, శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన రాజీనామా చేసినప్పటికీ, నిరసన జ్వాలలు భగ్గుమంటూనే ఉన్నాయి.