Amit Shah: 2024 తర్వాత జన గణన అక్కర్లేదు!...ఎలాగో చెప్పిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా!
- ఈ- సెన్సస్ దిశగా కేంద్రం అడుగులు
- జనన, మరణ రిజిస్టర్లు జన గణనకు జత
- 2024 తర్వాత జన గణన ఆటోమేటిక్‌గా అప్‌డేట్
- ఓటర్ల నమోదు కూడా ఆటోమేటిక్కేనన్న అమిత్ షా
దేశంలో పదేళ్లకోమారు జరిగే జనాభా లెక్కల సేకరణకు ఇక ప్రభుత్వం మంగళం పాడనుంది. దేశ జనాభాపై ఎప్పటికప్పుడు పక్కా వివరాలతో కూడిన గణాంకాల నమోదు కోసం కొత్త పద్ధతిని అవలంబించనున్నారు. 2024 తర్వాత అందుబాటులోకి వచ్చే 'ఈ-సెన్సస్'తో జనాభాపై పక్కా సమాచారం తెలుసుకోవచ్చు. దీంతో 2024 తర్వాత మన ఇళ్లకొచ్చి జనాభా వివరాలు సేకరించే సీను అస్సలు కనిపించదు.
ఈ దిశగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అసోం పర్యటనలో ఉన్న అమిత్ షా... జన గణన గురించి మాట్లాడారు. ఇకపై జనన, మరణ రిజిస్టర్లను జన గణనకు జత చేస్తామని ఆయన చెప్పారు. ఈ తరహా ఏర్పాటును 2024లోగా పూర్తి చేస్తామన్న ఆయన... ఆ తర్వాత దేశంలో నమోదయ్యే జననాలతో పాటు మరణాలు కూడా ఆటోమేటిక్‌గా జన గణనకు జత అవుతుంటాయని తెలిపారు.
అంతేకాకుండా ఆయా వ్యక్తుల వయసు 18 నిండగానే.. వారి పేర్లు ఆటోమేటిక్‌గా ఓటర్ల జాబితాలో చేరిపోతాయని కూడా ఆయన చెప్పారు. తాజాగా చేపట్టనున్న జన గణనలో ఈ తరహా మార్పులన్నీ చేస్తున్నామని చెప్పిన అమిత్ షా... ఈ-సెన్సస్‌లో అందరికంటే ముందు తన కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకుంటానని ఆయన ప్రకటించారు.