Kolkata Knight Riders: బుమ్రా శ్రమ వృథా.. కోల్‌కతా చేతిలో దారుణంగా ఓడిన రోహిత్ సేన
- 166 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ముంబై
- మరో 15 బంతులు మిగిలి ఉండగానే ఆలౌట్
- ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా జస్ప్రీత్ బుమ్రా
ఈ సీజన్లో అత్యంత దారుణ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్ మరోమారు విజయం ముందు చతికిలపడింది. 166 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని సైతం ఛేదించలేక 113 పరుగులకే కుప్పకూలి 52 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమితో పరాజయాల సంఖ్యను 9కి పెంచుకుంది.
గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై పేసర్ బుమ్రా మ్యాజిక్ చేశాడు. 4 ఓవర్లు వేసి 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. అయితే, బుమ్రా శ్రమను బ్యాటర్లు వృథా చేశారు. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై 17.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది.
రోహిత్ శర్మ (2) షరా మామూలుగానే పెవిలియన్ చేరగా మిగతా బ్యాటర్లు కూడా అతడి వెంటనే పెవిలియన్‌కు క్యూకట్టారు. ఒక్క ఇషాన్ కిషన్ మాత్రం 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి తర్వాత కీరన్ పొలార్డ్ చేసిన 15 పరుగులే రెండో అత్యధికమంటే ఆ జట్టు ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేకేఆర్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3, ఆండ్రూ రసెల్ రెండు వికెట్లు తీసి జట్టుకు ఘన విజయాన్ని అందించారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా వెంకటేశ్ అయ్యర్ (43), నితీశ్ రాణా (43) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. రహానే 25, రింకు సింగ్ 23 పరుగులు చేశారు. ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే అవుట్ కాగా, నలుగురైతే ఖాతా కూడా తెరవలేకపోయారు.
తొలుత భారీ స్కోరు దిశగా పయనించినట్టు కనిపించిన కోల్‌కతాను జస్ప్రీత్ బుమ్రా దారుణంగా దెబ్బతీశాడు. 5 వికెట్లు తీసి కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. 18వ ఓవర్లో షెల్టన్ జాక్సన్ (5), కమిన్స్ (0), నరైన్ (0)లను అవుట్ చేశాడు. అంతకుముందు రసెల్ (9), నితీశ్ రాణా (43) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కుమార్ కార్తికేయకు రెండు వికెట్లు దక్కాయి.
అద్భుత స్పెల్‌తో అదరగొట్టిన జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో విజయాల సంఖ్యను పెంచుకున్న కేకేఆర్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు మిణుకుమిణుకు మంటున్నాయి. ఇప్పటికే అట్టడుగున ఉన్న ముంబై ఈ ఓటమితో పరాజయాల సంఖ్యను పెంచుకుంది. ఐపీఎల్లో నేడు లక్నో సూపర్ జెయింట్స్-గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. విజయం సాధించిన జట్టు నేరుగా ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్తుంది.