Nandyal: నీటి కోసం వచ్చి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌లో నక్కిన చిరుత.. రాత్రంతా కాపుకాసిన రెస్క్యూ బృందం
- నీళ్లు తాగేందుకు అడవి నుంచి వచ్చిన చిరుత
- నిర్మాణంలో ఉన్న పిల్లర్ల వద్ద విశ్రమించిన వైనం
- అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిన కూలీలు
- రాత్రివేళ ఎవరూ బయటకు రావద్దని సమీప గ్రామాల ప్రజలకు హెచ్చరిక
నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌లో నక్కిన ఓ చిరుత అటవీశాఖ అధికారులు, రెస్క్యూ బృందం, సమీప గ్రామాల ప్రజలకు రాత్రంతా నిద్రను దూరం చేసింది. నీరు తాగేందుకు అడవి నుంచి వచ్చిన చిరుత పోతిరెడ్డిపాడు సమీపంలోని రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకుంది. అక్కడ నిర్మాణంలో ఉన్న పిల్లర్ల వద్ద విశ్రమించింది. గుర్తించిన కూలీలు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే రెస్క్యూ, వైద్య బృందంతో కలిసి అక్కడకు చేరుకున్నారు.
అలికిడికి లేచిన చిరుత అక్కడి నుంచి మరో పిల్లరు వద్దకెళ్లి గేటు చాటున నక్కింది. అక్కడి నుంచి ఎంతకూ కదలకపోవడంతో సమీప గ్రామాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. రాత్రి వేళ ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, చిరుత బయటకు వస్తే పట్టుకునేందుకు అధికారులు రాత్రంతా అక్కడే పడిగాపులు కాసినా ఫలితం లేకుండా పోయింది.