Atchannaidu: నారాయణ అరెస్ట్ పై అచ్చెన్నాయుడు ఆగ్రహం.. జగన్ పై తీవ్ర విమర్శలు!

Atchannaidu fire on Jagan amid Narayana arrest

  • జగన్ అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్ట్ అన్న అచ్చెన్న 
  • పేపర్ లీకేజీనే లేనప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్న 
  • ప్రతి అక్రమ అరెస్ట్ కు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక 

మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ అరెస్ట్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ అరెస్ట్ చేయించారని విమర్శించారు. ఈ మూడేళ్లలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం, అక్రమ అరెస్ట్ లు చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదని అన్నారు. 

ఒక మాజీ మంత్రికి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దారుణమని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఎక్కడా జరగలేదని సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెపుతున్నారని... లీకేజీనే లేనప్పుడు నారాయణను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. రాజకీయ కుట్రలో భాగంగా చేసిన అక్రమ అరెస్ట్ ఇదని అన్నారు.

పరీక్షల నిర్వహణలో విఫలమైన వైసీపీ ప్రభుత్వం... ఆ మచ్చను చెరిపేసుకోవడానికి నారాయణపై నెపం నెట్టిందని చెప్పారు. జగన్ పట్ల రోజురోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని... అందుకే ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ప్రతి అక్రమ అరెస్ట్ కు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News