Budda Venkanna: నారాయణ అరెస్ట్ పై బుద్ధా వెంకన్న, అశోక్ గజపతిరాజు స్పందన
- ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో ప్రభుత్వం చెడ్డపేరు తెచ్చుకుందన్న వెంకన్న
- ఆ పాపాన్ని నాారాయణపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్య
- తనను కూడా అక్రమంగా అరెస్ట్ చేశారన్న అశోక్
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఆ పాపాన్ని నారాయణపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ అరెస్ట్ వెనుక సీఎం జగన్ కుట్ర ఉందని అన్నారు. అక్రమ అరెస్టులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు.
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం సాధారణ విషయంగా మారిపోయిందని చెప్పారు. తనపైనా, కళా వెంకట్రావుపైనా కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని అన్నారు. రాష్ట్రంలో 150కి పైగా ఆలయాలపై దాడులు జరిగితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని విమర్శించారు. జగన్ ప్రజాహితం కోసం కాకుండా అధికార దుర్వినియోగం కోసం పని చేస్తున్నారని అన్నారు.