Kim Jong Un: ఉత్తర కొరియాలో యువతుల వేషధారణపై కఠిన ఆంక్షలు విధించిన కిమ్
- దేశంలో పాశ్చాత్య సంస్కృతిపై కిమ్ సర్కారు కన్నెర్ర
- ఇటీవలే టైట్ జీన్స్, హెయిర్ స్టయిల్స్ పై ఆంక్షలు
- తాజాగా జుట్టుకు రంగులు వేయడంపై నిషేధం
- కఠినంగా అమలు చేయాలని సర్కారు నిర్ణయం
ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి ఆంక్షల కొరడా ఝుళిపించారు. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువతుల వేషధారణపై తీవ్ర ఆంక్షలు విధించారు. యువతులు టైట్ జీన్స్ వేసుకోవడం, అభ్యంతరకర రాతలు ఉన్న దుస్తులు ధరించడంపై ఇటీవలే నిషేధం విధించారు. తాజాగా, యువతులు జుట్టుకు రంగులు వేయడంపైనా కిమ్ సర్కారు నిషేధం విధించింది.
ఆంక్షలను ఉల్లంఘించిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలిస్తారని స్పష్టం చేసింది. వారు తప్పును అంగీకరించాల్సి ఉంటుందని, మరోసారి ఆ తప్పుచేయబోమని హామీ ఇస్తేనే విడుదల చేస్తారని ప్రభుత్వం పేర్కొంది. పాశ్చాత్య ఫ్యాషన్ పోకడలు విషపూరితమైనవని కిమ్ గతంలోనే సెలవిచ్చారు. ఈ నేపథ్యంలో, దేశంలో విదేశీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని ఉత్తర కొరియా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.