Asani: 'అసని' ఎఫెక్ట్... ఏపీకి 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- బంగాళాఖాతంలో అసని తుపాను
- తీవ్ర తుపానుగా కొనసాగుతున్న అసని
- ఏపీ తీరానికి చేరువగా వస్తున్న వైనం
- సమీక్షించిన కేంద్ర హోంశాఖ
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తీవ్ర తుపాను ఏపీ, ఒడిశా తీరాల దిశగా వస్తుండడం పట్ల కేంద్రం అప్రమత్తమైంది. అసని తుపానుపై కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలో అసని ప్రభావం ఉంటుందని భావిస్తున్న ఏపీకి 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. మరో 7 బృందాలను సిద్ధంగా ఉంచింది. అటు, ఒడిశాకు ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ను పంపించగా... మరో 17 బృందాలను సిద్ధంగా ఉంచనున్నారు. పశ్చిమ బెంగాల్ లో 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించగా, 5 బృందాలను సిద్ధంగా ఉంచారు.
ఏపీ, ఒడిశాలో తుపాను పరిస్థితులపై ఆయా రాష్ట్రాల అధికారులతో కలిసి సమీక్షిస్తుండాలని కేంద్ర హోంశాఖ ఇతర మంత్రిత్వ శాఖలను ఆదేశించింది.
కాగా, అసని తీవ్ర తుపాను దిశ మార్చుకుని మచిలీపట్నం వద్ద తీరం దాటనుందని ప్రైవేటు వాతావరణ సంస్థల తాజా నమూనాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అనేకప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.