Sri Lanka: హింసకు పాల్పడే నిరసనకారులపై కాల్పులు జరిపేందుకు శ్రీలంక భద్రతా బలగాలకు ఆదేశాలు
- శ్రీలంకలో అత్యంత తీవ్రస్థాయిలో ఆర్థిక సంక్షోభం
- ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం
- సైన్యం, పోలీసులకు మరిన్ని అధికారాల మంజూరు
- వారెంట్లు లేకుండానే అరెస్టులు
ఎమర్జెన్సీ గుప్పిట్లో కొనసాగుతున్న శ్రీలంకలో సైన్యానికి, పోలీసులకు మరిన్ని అధికారాలు కల్పించారు. ఆందోళనకారులు హింసాత్మక సంఘటనలకు పాల్పడడం పట్ల శ్రీలంక ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ప్రజా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వారిపైనా, హాని కలిగించే వారిపైనా కాల్పులు జరిపేందుకు భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఎలాంటి వారెంట్లు లేకుండా అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది.
శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభం పట్ల మండిపడుతున్న ప్రజలు... ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లను దగ్ధం చేశారు.
ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స వైదొలిగాక హింస మరింత ప్రజ్వరిల్లింది. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఏడుగురు మరణించగా, 200 మంది వరకు గాయపడ్డారు. నిన్న అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి అతుకోరల ఆందోళనకారులు వెంటాడడంతో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం తెలిసిందే.