KRMB: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాశయాల నిర్వహణ కమిటీ ఏర్పాటు
- ఆరుగురు సభ్యులతో కమిటీ
- కమిటీ కన్వీనర్‌గా కేఆర్ఎంబీ సభ్యుడు రవికుమార్ పిళ్లై
- సభ్యులుగా కేఆర్ఎంబీ సభ్యుడు మౌతాంగ్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు
- ఇరు రాష్ట్రాల జెన్కో అధికారులకూ చోటు
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై ఏర్పాటైన జలాశయాల నిర్వహణకు ఓ కమిటీ ఏర్పాటైంది. హైదరాబాద్ జలసౌధలో ఇటీవల జరిగిన భేటీలో కేఆర్ఎంబీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నేడు ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ కేఆర్ఎంబీ కీలక ప్రకటన చేసింది. కేఆర్ఎంబీ సభ్యుడు రవికుమార్ పిళ్లై ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.
ఇక కమిటీలో మిగిలిన సభ్యులుగా కేఆర్ఎంబీ సభ్యుడు మౌతాంగ్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు, రెండు రాష్ట్రాల జెన్కోలకు చెందిన వెంకటరాజం, సృజయ్ కుమార్‌లు నియమితులయ్యారు. ప్రధానంగా మూడు అంశాల ఆధారంగా ఈ కమిటీ ఏర్పాటైంది. శ్రీశైలం, సాగర్‌లో విద్యుదుత్పత్తి కోసం 15 రోజుల్లోగా విధి విధానాలు ఖరారు చేయాలని, నెలలోగా శ్రీశైలం, సాగర్ జలాశయాల రూల్ కర్వ్ ముసాయిదా పరిశీలన జరగాలని, 75 శాతం లభ్యతకు పైబడి వరద జలాల వినియోగానికి విధి విధానాలు రూపొందించాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ కమిటీ ఏర్పాటైంది.