IPL 2022: లో స్కోరింగ్ మ్యాచ్‌లో చేతులెత్తేసిన లక్నో.. 62 పరుగుల తేడాతో దారుణ పరాజయం

GT decimate LSG to enter playoffs

  • బాల్‌తో రాణించి, బ్యాటింగులో విఫలమైన లక్నో
  • సింగిల్ డిజిట్‌కే పరిమితమైన 8 మంది ఆటగాళ్లు
  • ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోను 82 పరుగులకే కుప్పకూల్చి 62 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గుజరాత్ అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఫలితంగా ఆ బెర్త్ సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. తొలుత బంతితో రాణించి హార్దిక్ పాండ్యా సేనను 144 పరుగులకే కట్టడి చేసిన కేఎల్ రాహుల్ జట్టు బ్యాటింగ్‌లో తడబడింది. 

గుజరాత్ బౌలర్ల వాడి బంతులకు వరుసగా వికెట్లు సమర్పించుకుని ఓటమి పాలైంది. ఆ జట్టులో 8 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. డికాక్ 11, అవేశ్ ఖాన్ 12 పరుగులు చేశారు. 27 పరుగులు చేసిన దీపక్ హుడా టాప్ స్కోరర్ అంటే ఆ జట్టు బ్యాటింగ్ తీరు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టి లక్నో బ్యాటింగ్ ఆర్డర్‌ను ఛిన్నాభిన్నం చేయగా, యశ్ దయాళ్, సాయి కిషోర్ చెరో వికెట్ తీసుకున్నారు. షమీకి ఒక వికెట్ దక్కింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. చేతిలో కావాల్సినన్ని వికెట్లు ఉన్నప్పటికీ బ్యాట్ ఝళిపించడంలో టైటాన్స్ బ్యాటర్లు విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ శుభమన్ గిల్ 63 పరుగులతో అజేయంగా నిలవగా, మిల్లర్ 26, రాహుల్ తెవాటియా 22 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా, మోసిన్ ఖాన్, హోల్డర్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో గుజరాత్ అధికారికంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఓడిన లక్నో రెండో స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్-ఢిల్లీ కేపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

  • Loading...

More Telugu News