Allari Naresh: నాన్న ఆ సినిమాకి సీక్వెల్ రాసిపెట్టుకున్నారు: 'అల్లరి' నరేశ్
- నటుడిగా 20 ఏళ్లను పూర్తిచేసుకున్న అల్లరి నరేశ్
- తన తండ్రిని తలచుకుని బాధపడిన నరేశ్
- నాన్న కథలు పదిలంగా ఉన్నాయంటూ వ్యాఖ్య
- 'అలీబాబా డజను దొంగలు' స్క్రిప్ట్ రెడీగా ఉందంటూ స్పష్టీకరణ
హాస్య కథానాయకుడిగా 'అల్లరి' నరేశ్ కి మంచి క్రేజ్ ఉంది. 2002లో 'అల్లరి' సినిమాతో హీరోగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. ఆ సినిమా విడుదలై నిన్నటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. అంటే అల్లరి నరేశ్ కెరియర్ 20 ఏళ్లను పూర్తిచేసుకుందన్న మాట. ఈ సందర్భంగా అల్లరి నరేశ్ మాట్లాడుతూ, తన తండ్రి ఈవీవీ సత్యనారాయణను గుర్తుచేసుకున్నాడు.
"మా నాన్నగారికి కామెడీ అంటే ఇష్టం. ఎంతోమంది కమెడియన్స్ ను .. హాస్య రచయితలను ఆయన ప్రోత్సహించారు. చనిపోవడానికి కొంతకాలం ముందుగా ఆయన రాసుకున్న కథలు .. అనుకున్న టైటిల్స్ ఇప్పటికీ మా ఇంట్లో పదిలంగా ఉన్నాయి. వాటిని చూసినప్పుడల్లా మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది.
నాన్న కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'అలీబాబా అరడజను దొంగలు' ఒకటి. ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని నాన్న అనుకున్నారు. స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారు. 'అలీబాబా డజను దొంగలు' అనే టైటిల్ ను కూడా ఆయన సెట్ సుకున్నారు. కానీ నాన్న గారు అనుకున్నట్టుగా ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ చేయడం కష్టమే" అని చెప్పుకొచ్చాడు.