Gautam Gambhir: లక్నో జట్టుకు బ్రెయిన్ వాష్ చేసిన మెంటార్ గంభీర్
- ఆటలో ఓటమి సహజమేనన్న గంభీర్
- మనం ఓడిన తీరులోనే లోపం ఉందని వెల్లడి
- చేతులారా మ్యాచ్ కోల్పోయామని వ్యాఖ్య
- క్రీడలో బలహీనతకు చోటు లేదన్న మెంటార్
ఐపీఎల్ 2022 సీజన్ లో మంచి పనితీరు చూపిస్తున్న టాప్ 2 జట్లలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఒకటి. మరో టీమ్ గుజరాత్ టైటాన్స్ (జీటీ). ఈ రెండు ఈ ఏడాదే ప్రయాణం ఆరంభించిన కొత్త జట్లు. అన్నింటి కంటే బలంగా కనిపిస్తున్న జీటీ చేతిలో లక్నో జట్టు మంగళవారం ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 144 పరుగులు సాధించింది. ఒక రకంగా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగింది లక్నో జట్టు.
కానీ, బ్యాటింగ్ విషయంలో లక్నో తేలిపోయింది. దీపక్ హుడా ఒక్కడు తప్పించి మరెవరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు. వచ్చినవాడు వచ్చినట్టే వెళ్లిపోవడం కనిపించింది. కనీసం పోరాట పటిమను ప్రదర్శించి ఓటమి పాలైనా ఎవరూ ఏమీ అనుకోరు. కానీ, నిన్నటి మ్యాచ్ లో అదే మిస్సయింది. ఇది చూసి లక్నో జట్టు మెంటార్ అయిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు కూడా చిర్రెత్తుకొచ్చింది. మంగళవారం రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు అంతటినీ కూర్చోబెట్టి క్లాస్ పీకాడు.
‘‘చూడండి.. ఓడిపోవడం తప్పేమీ కాదు. ఒక జట్టు గెలవాలి. మరో జట్టు ఓడాల్సిందే. కానీ, మనం ఓడిన తీరులోనే లోపం ఉంది. నిజం చెప్పాలంటే ఈ రోజు చేతులారా మ్యాచ్ ను కోల్పోయాం. బలహీనంగా కనిపించాం. నిజాయతీగా చెప్పాలంటే ఐపీఎల్ వంటి టోర్నమెంట్ లేదా మరో ఆట అయినా బలహీనంగా ఉంటే చోటు ఉండదు. మనం ఎన్నో జట్లను ఓడించాం. మంచి క్రికెట్ ఆడాం. కానీ ఈ రోజు ఆట స్పృహ అన్నదే లేకుండా పోయింది. అది కీలకం.
వాళ్లు చక్కగా బౌలింగ్ చేశారు. వాళ్లు మంచిగా బౌలింగ్ చేస్తారనే అనుకుంటాం. ఇది ప్రపంచ స్థాయి పోటీ. అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొని మీరు ఆడుతున్నారు. మనల్ని చాలెంజ్ చేసే వాళ్లు కావాలి. అందులో సందేహం లేదు. దాని కోసమే మనం ఆడుతున్నాం. చాలెంజ్ చేసేందుకే సాధన చేస్తున్నాం’’ అంటూ జట్టు సభ్యుల్లో సానుకూల ధోరణిని నింపేందుకు గంభీర్ ప్రయత్నించారు. ఈ సీజన్ లో గుజరాత్ జట్టుతో ఆడిన రెండు మ్యాచుల్లోనూ లక్నో ఓటమి పాలైంది.