Ranveer Singh: నాకు తెలుగు రాకపోయినా.. 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు చూశా: రణవీర్ సింగ్
- అన్ని సినిమాలు భారతీయ సినిమాలేనన్న రణవీర్
- అన్ని సినిమాలు మన సినిమాలేనని వ్యాఖ్య
- పాన్ ఇండియాగా వచ్చిన సినిమాలన్నీ మంచి సినిమాలేనంటూ ప్రశంసలు
భారతీయ సినీ రంగంలో ప్రస్తుతం లాంగ్వేజ్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హిందీ జాతీయ భాష కాదంటూ కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. హిందీ ఎప్పటికీ జాతీయ భాషేనంటూ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ స్పందించడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ హీటు పెంచారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ మాట్లాడుతూ... అన్ని సినిమాలు భారతీయ సినిమాలే అని చెప్పాడు. అన్ని సినిమాలు మన సినిమాలే అని వ్యాఖ్యానించారు. తాను కేవలం నటుడిని మాత్రమేనని.. నిర్మాతను లేదా వ్యాపారిని కాదని రణవీర్ సింగ్ చెప్పాడు.
తాను పెయిడ్ ప్రొఫెషనల్ నని... డబ్బులు తీసుకుని కెమెరా ముందు నటిస్తానని... తనకున్న జ్ఞానం అంత వరకేనని అన్నాడు. హిందీలో డబ్ అయి, పాన్ ఇండియా చిత్రాలుగా వచ్చిన సినిమాలు మంచి సినిమాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పాడు. తనకు తెలుగు రాకపోయినా 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు చూశానని తెలిపాడు.