CSK: జడేజాను సీఎస్కే ట్విట్టర్ లో ఎందుకు అన్ ఫాలో చేసినట్టు..?
- సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలియదన్న సీఈవో కాశీ విశ్వనాథన్
- జడ్డూ గాయం కారణంగానే ఆడలేదని వివరణ
- వైద్యుల సూచనలతో ఈ సీజన్ కు ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
- భవిష్యత్తులోనూ సీఎస్కే కోసం ఆడతాడని స్పష్టీకరణ
చెన్నై సూపర్ కింగ్స్ కి, జట్టు సభ్యుడు, మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజాకి మధ్య పొరపొచ్చాలు వచ్చాయన్న వదంతులకు ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ పుల్ స్టాప్ పెట్టారు. ఎంతో నమ్మకం ఉంచి కెప్టెన్సీ ఇచ్చినా జడేజా ఫెయిల్ కావడం జట్టు యాజమాన్యాన్ని నిరాశకు గురి చేసినట్టు వార్తలు వచ్చాయి. ఎనిమిది మ్యాచ్ ల తర్వాత అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. తిరిగి ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోగా.. తర్వాత రెండు మ్యాచుల్లో ఆడిన జడేజా బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ గ్ లోనూ రాణించలేకపోయాడు.
ఇక 11వ మ్యాచ్ లో అతడు పాల్గొనలేదు. గాయం కారణంగా మిగిలిన మ్యాచ్ లకు సైతం అందుబాటులో ఉండడంటూ యాజమాన్యం ప్రకటించింది. ఈ క్రమంలో సీఎస్కే తన ట్విట్టర్ పేజీలో జడేజాను అన్ ఫాలో చేయడంతో ఎక్కడో ఏదో తేడా వచ్చిందన్న అభిప్రాయాలకు తావిచ్చింది. దీనిపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు.
కేవలం వైద్య కారణాల వల్లే జడేజాను రిలీజ్ చేసినట్టు ఆయన చెప్పారు. ‘‘సోషల్ మీడియాను నేను ఫాలో అవడం లేదు. అక్కడ ఏం జరుగుతోందో నాకు తెలియదు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు సమస్య ఏదీ లేదు. జడేజా సీఎస్కే కోసం భవిష్యత్తులోనూ ఆడతాడు.
ఆర్సీబీతో మ్యాచ్ లో జడ్డూకు గాయం అయింది. ఆ తర్వాత ఢిల్లీతో మ్యాచ్ లో అందుకే ఆడలేదు. వైద్యుల సూచనల మేరకు ఐపీఎల్ సీజన్ లో మిగిలిన మ్యాచుల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నాం. అతడు తిరిగి ఇంటికి వెళుతున్నాడు’’ అని విశ్వనాథన్ చెప్పారు. రూ.16 కోట్లకు జడేజాను సీఎస్కే రిటైన్ చేసుకుంది. జట్టు నుంచి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అతడు రాణించకపోవడం అభిమానులను మాత్రం నిరాశకు గురి చేసింది.