LIC IPO: ఎల్ఐసీ ఐపీవోపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ.. విచారణకు ఓకే
- ఎల్ఐసీ ఐపీవోను సవాలు చేస్తూ పలు పిటిషన్లు
- మధ్యంతర ఉపశమనం అవసరం లేదన్న సుప్రీం
- రాజ్యాంగ ధర్మాసనానికి విచారణ బదిలీ
దేశంలోనే అతిపెద్దదైన ఎల్ఐసీ ఐపీవోకు ఆటంకం తొలగిపోయింది. ఎల్ఐసీ ఐపీవో ప్రక్రియపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ప్రక్రియలో జోక్యం చేసుకునేందకు నిరాకరించింది. ఈ కేసులో మధ్యంతర ఉపశమనం కల్పించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
ఎల్ఐసీ ఐపీవోను సవాలు చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. మనీబిల్లు ద్వారా ప్రభుత్వం ఎల్ఐసీ ఐపీవోను చేపట్టడాన్ని పిటిషనర్లు సవాలు చేశారు. ప్రజల హక్కులు ఇందులో ఇమిడి ఉన్నందున మనీ బిల్లు ద్వారా చేపట్టాల్సింది కాదని పిటిషనర్ల తరఫున న్యాయవాది శ్యామ్ దివాన్ ధర్మాసనానికి నివేదించారు.
అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదిస్తూ.. భారత చరిత్రలో అతిపెద్ద ఐపీవో ఇదని పేర్కొంటూ.. 73 లక్షల దరఖాస్తుదారులు ఇందులో పాల్గొన్నట్టు తెలిపారు. దీంతో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం దీన్ని రాజ్యంగ ధర్మాసనానికి నివేదించింది. ఎనిమిది వారాల్లో స్పందన తెలియజేయాలని ఎల్ఐసీని ఆదేశించింది.