Cricket: కోహ్లీ కోసం చేయగలిగిందల్లా ప్రార్థించడమే: పాకిస్థాన్ ఓపెనర్ రిజ్వాన్
- టీమిండియా మాజీ సారథి ఫామ్ పై రిజ్వాన్ వ్యాఖ్యలు
- కోహ్లీ అంటేనే చాంపియన్ అని కామెంట్
- కష్టపడి మళ్లీ పునర్వైభవం సాధిస్తాడని ధీమా
ఫామ్ లేమితో సతమతమవుతున్న కింగ్ కోహ్లీ.. ఈ ఐపీఎల్ లో పరుగులు చేయడానికే తంటాలు పడిపోతున్నాడు. ఎక్కువసేపు క్రీజులో నిలువలేక ఆపసోపాలు పడుతున్నాడు. రికార్డ్ గోల్డెన్ డక్ లతో చాలా చెత్త రికార్డునూ మూటగట్టుకున్నాడు. అయితే, అతడి ఫామ్ పై పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ స్పందించాడు.
కోహ్లీ చాలా కష్టపడే వ్యక్తని, త్వరగా ఫామ్ లోకి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పాడు. క్రికెట్ లో ఎన్నో ఘనతలు, శిఖరాలు అధిరోహించిన కోహ్లీ ప్రస్తుతం చాలా కఠిన సమయాలను ఎదుర్కొంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కోహ్లీ అంటేనే చాంపియన్ ప్లేయర్ అన్నాడు.
అందరికీ కష్టాలు వస్తాయని, ఆ వెంటనే అవి సమసిపోతాయని చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లంతా సెంచరీలు చేసినవాళ్లేనని, ఏదో ఒక సందర్భంలో ఔట్ అవుతారని చెప్పాడు. ఇలాంటి సమయంలో కోహ్లీ కోసం తాను చేయగలిగిందల్లా ప్రార్థించడమేనని, కష్టపడి మళ్లీ పునర్వైభవం తీసుకొస్తాడన్న నమ్మకం తనకుందని చెప్పాడు. అన్ని విషయాలను కంట్రోల్ లోకి తెస్తాడని రిజ్వాన్ అన్నాడు.