Thomas Cup: థామస్ కప్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. 43 ఏళ్ల తర్వాత సెమీస్‌లోకి ఇండియా

Indian mens team secure historic first medal at Thomas Cup

  • 1979 తర్వాత థామస్ కప్‌ సెమీస్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత్
  • పతకం ఖాయం చేసుకున్న భారత జట్టు
  • ఉబెర్ కప్‌లో సింధు నేతృత్వంలోని జట్టు ఓటమి

బ్యాంకాక్‌లో జరుగుతున్న థామస్ కప్‌ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ కొత్త చరిత్రను లిఖించింది. 43 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ సెమీస్‌లోకి దూసుకెళ్లి పతకాన్ని ఖరారు చేసుకుంది. నిన్న మలేషియాతో జరిగిన హోరాహోరీ పోరులో 3-2తో చిత్తుచేసింది. నిజానికి ఈ పోరులో భారత్ తొలుత వెనకబడింది. భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ తొలి పోరులో లీ జీ జియా చేతిలో 21-23, 9-21తో వరుస సెట్లలో ఓటమి పాలయ్యాడు. 

అయితే, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడి 21-19, 21-15తో గోఫియ్-ఇజుద్దీన్‌పై విజయం సాధించి భారత్‌ను తిరిగి రేసులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత సింగిల్స్‌లో తెలుగు ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ 21-11, 21-17తో జె యంగ్‌పై విజయం సాధించడంతో భారత్ 2-1తో ముందంజ వేసింది.

అయితే, ఆ తర్వాత డబుల్స్‌ జోడీ కృష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్ 19-21, 17-21తో ఓటమి పాలు కావడంతో స్కోర్లు 2-2తో సమం అయ్యాయి. ఈ క్రమంలో ప్రణయ్ ఒత్తిడిలోనూ చెలరేగి జున్ హోను 21-13, 21-8తో చిత్తు చేసి భారత్‌ను సెమీస్‌కు చేర్చాడు. ఫలితంగా దేశానికి పతకం ఖాయమైంది. 1979 తర్వాత భారత్ ఏనాడూ థామస్ కప్ సెమీస్‌కు చేరుకోలేదు. అంతకుముందు వేరే ఫార్మాట్‌లో ఉన్నప్పుడు భారత్ మూడుసార్లు సెమీస్‌కు చేరింది. అయితే, అప్పుడు విజేతలకు మాత్రమే పతకాలు ఇచ్చేవారు. ఫార్మాట్ మారిన తర్వాత మాత్రం భారత్ సెమీస్ చేరడం ఇదే తొలిసారి.

మరోవైపు, ఉబెర్ కప్‌లో పీవీ సింధు సారథ్యంలోని భారత మహిళల జట్టు నిరాశపరిచింది. క్వార్టర్ ఫైనల్‌లో థాయ్‌లాండ్ చేతిలో 0-3తో దారుణంగా ఓడింది. అలాగే, తొలి సింగిల్స్‌లో రచనోక్ ఇంటోనన్ చేతిలో పీవీ సింధు 21-18, 17-21, 12-21తో పరాజయం పాలైంది. డబుల్స్‌లో శ్రుతి మిశ్రా-సిమ్రాన్ సింగ్  16-21, 13-21తో జాంగ్‌కోపాన్-రవిండా చేతిలో ఓటమి పాలు కావడంతో ఉబెర్ కప్‌లో పతకం సాధించాలన్న భారత్ కల చెదిరింది. ఆ తర్వాత అక్షరి కశ్యప్ కూడా థాయ్‌లాండ్‌కు చెందిన చోచువాంగ్ చేతిలో వరుస సెట్లలో ఓటమి పాలు కావడంతో భారత్ ఓటమి పరిపూర్ణమైంది.

  • Loading...

More Telugu News