Andhra Pradesh: రిమాండ్ లేకుండానే బెయిలా?.. నారాయణ బెయిల్ ను రద్దు చేయాలంటూ ప్రభుత్వం పిటిషన్
- చిత్తూరు జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు
- ఇవాళ మధ్యాహ్నం విచారణ
- కోర్టు ఆదేశాలానుసారం హైకోర్టుకు వెళ్లే యోచనలో సర్కార్
ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంటర్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో హైదరాబాద్ లో ఆయన్ను రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిత్తూరు మేజిస్ట్రేట్ ముందు అదే రోజు అర్ధరాత్రి ప్రవేశపెట్టారు. ఆ తెల్లారే ఆయన బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.
అయితే, ఆ బెయిల్ ను రద్దు చేయాలంటూ చిత్తూరు జిల్లా కోర్టులో ఏపీ ప్రభుత్వం రివిజన్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఇవాళ మధ్యాహ్నం కోర్టు దానిపై విచారణ చేపట్టనుంది. రిమాండ్ విధించకుండానే నారాయణకు బెయిల్ ఇచ్చారంటూ పిటిషన్ లో ప్రభుత్వం పేర్కొన్నట్టు తెలుస్తోంది.
జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ వేస్తేనే హైకోర్టులో పిటిషన్ వేసేందుకు అవకాశం ఉండడంతో ఫార్మాలిటీగా రివిజన్ వ్యాజ్యాన్ని ప్రభుత్వం దాఖలు చేసినట్టు సమాచారం. కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా హైకోర్టుకు వెళ్లడంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.