Finland: నాటోలో చేరేందుకు ఫిన్లాండ్, స్వీడన్ ఆసక్తి.. తీవ్ర పరిణామాలు తప్పవని రష్యా హెచ్చరిక
- నాటోలో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంటామన్న ఫిన్లాండ్
- స్వాగతించిన నాటో సెక్రటరీ జనరల్
- ప్రతీకార చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న రష్యా
రష్యా పొరుగు దేశాలైన ఫిన్లాండ్, స్వీడన్ సైతం నాటో దిశగానే అడుగులు వేస్తున్నాయి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరేందుకు దరఖాస్తు చేసుకోనున్నట్టు ఫిన్లాండ్ నేతలు గురువారం ప్రకటించారు. ఆ తర్వాత స్వీడన్ సైతం ఫిన్లాండ్ బాటలోనే నడువనున్నట్టు తెలుస్తోంది.
ఈ పరిణామాల పట్ల రష్యా అధ్యక్ష కార్యాలయం తీవ్రంగా స్పందించింది. సైనిక, సాంకేతిక చర్యలతో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేస్తామని ఫిన్లాండ్ అధ్యక్షుడు, ప్రధాని ప్రకటించారు. ‘‘దీనికి కారణం మీరే (రష్యా). అద్దంలో చూసుకోండి’’ అని ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టో ప్రకటన చేశారు.
ఫిన్లాండ్ మాదిరే స్వీడన్ కూడా ఆలోచన చేస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా దాడి చూసిన తర్వాత నాటోలో చేరడమే మంచిదన్న అభిప్రాయం ఫిన్లాండ్, స్వీడన్ నేతలు, ప్రజల్లో బలపడుతోంది. స్వీడన్, ఫిన్లాండ్ కు కూటమి స్వాగతం పలుకుతున్నట్టు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ ప్రకటన చేశారు.
కానీ, ఇదే జరిగితే రష్యా చుట్టూ నాటో చేరినట్టు అవుతుంది. అది రష్యాకు ఎప్పటికీ ముప్పే. అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై దాడి చేయడానికి నేపథ్యం ఇదే. నాటోలో చేరితే.. తనకు పక్కలో బల్లెం మాదిరిగా ఉక్రెయిన్ మారుతుందని.. రష్యా భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆయన భావిస్తున్నారు. నాటోలో చేరొద్దని ఉక్రెయిన్ ను ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పుతిన్ మాటలను పెడచెవిన పెట్టారు. దీంతో చివరికి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగింది. మూడు నెలలు అవుతున్నా అది కొలిక్కి రావడం లేదు.
ఇప్పుడు ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరాలనుకోవడం రష్యా ఆందోళనలను మరింత పెంచేదే. ఒకవైపు ఉక్రెయిన్ నాటోలో చేరకపోయినా ఆ దేశానికి పరోక్షంగా నాటో, అమెరికా భారీ ఆయుధాలతో మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ పై రష్యా పైచేయి సాధించలేకపోతోంది. నాటో, రష్యా మధ్య ప్రత్యక్ష ఘర్షణకు ఈ చర్యలు దారితీస్తాయని రష్యా అధ్యక్ష కార్యాలయం హెచ్చరించింది. పూర్తి స్థాయి అణు యుద్ధానికి దారితీయవచ్చని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ దిమిత్రీ మెద్వదేవ్ అన్నారు.