CJI: జ్ఞానవాపి మసీదు సర్వే.. పత్రాలను చదవకుండా తాను ఆర్డర్స్ ఎలా ఇవ్వగలనన్న సీజేఐ ఎన్వీ రమణ!
- మసీదులో సర్వే చేయాలని ఆదేశించిన వారణాసి కోర్టు
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇంతెజామియా మసీదు కమిటీ
- పత్రాలను చదివిన తర్వాతే ఆర్డర్స్ ఇవ్వగలనన్న సీజేఐ
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వేను కొనసాగించాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకునే ఈ మసీదు ఉంటుంది. ఈ మసీదులో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని, అందువల్ల విగ్రహాలకు ప్రతి రోజు అర్చనలు చేసేందుకు అనుమతించాలని కొందరు వారణాసి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు మసీదులో వీడియో సర్వే చేసి మే 17లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో వారణాసి కోర్టు తీర్పును అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. వీరి పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. మసీదు కమిటీ తరపున సీనియర్ అడ్వొకేట్ హుజెఫా అహ్మది వాదనలు వినిపిస్తూ... వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపి వేయాలని కోరారు. మసీదులో సర్వే చేయాలని కోర్టు ఆదేశించిందని... ప్రార్థనా స్థలాల చట్టానికి ఇది విరుద్ధమని, ఇది చాలా పురాతనమైన మసీదు అని చెప్పారు.
న్యాయవాది వ్యాఖ్యలపై సీజేఐ ఎన్వీ రమణ స్పందిస్తూ, దీనికి సంబంధించిన పత్రాలను తాము చూడలేదని, సమస్య ఏమిటో కూడా తమకు తెలియదని, దీని గురించి తెలియకుండానే కోర్టు ఆదేశాలను ఆపుతూ తాను ఆర్డర్స్ ఎలా ఇవ్వగలనని ప్రశ్నించారు. పత్రాలను చదివిన తర్వాత ఆర్డర్ ఇస్తానని చెప్పారు.